మధ్యాహ్నం క్యాబినెట్ లో ఏం జరుగుతుంది ?

మొత్తానికి చంద్రబాబునాయుడు విన్నపానికి కేంద్ర ఎన్నికల కమీషన్ సానుకూలంగా స్పందించింది. అయితే షరతులు విధించిందనుకోండి అది వేరే సంగతి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నపుడు క్యాబినెట్ సమావేశం జరపకూడదు. ఎందుకంటే, విధానపరమైన నిర్ణయాలు, ఆర్ధికఅంశాలపై నిర్ణయాలు తీసుకోకూడదు కాబట్టి. కానీ చంద్రబాబు పంతం కొద్దీ క్యాబినెట్ సమావేశం జరపాలని నిర్ణయించారు.

సరే క్యాబినెట్ లో ఏ అంశాలపై చర్చించాలని అనుకుంటున్నారో చెప్పాలని ఈసీ అడిగింది. కరువు, మంచినీటి ఎద్దడి, ఉపాధిహామీపథకం, ఫణితుపాను అంశాలపై చర్చించనున్నట్లు చంద్రబబు సీఈసీకి ప్రతిపాదనలు పంపారు. వీటిని పరిశీలించిన తర్వాత షరతులతో కూడిన అనుమతిచ్చింది. ప్రతిపాదించిన అంశాలు తప్ప ఇతరత్రా అంశాలపై చర్చించేందుకు లేదని, విధానపరమైన అంశాలపై నిర్ణయాలు తీసుకోకూడదని స్పష్టంగా ఆదేశించింది సీఈసీ.

మరి మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలయ్యే క్యాబినెట్ లో సీఈసీ ఆదేశాల ప్రకారమే సమావేశం జరుపుతారా ? లేకపోతే తానిష్టం వచ్చినట్లు నడుచుకుంటారా అన్నది చూడాలి. ఎందుకంటే, ఉపాధిహామీ పథకంలో దాదాపు రూ. 2 వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ కూడా టిడిపికి చెందిన నేతలు కమ్ కాంట్రాక్టర్లవే.

అలాగే పోలవరం ప్రాజెక్టులో వందల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఇవి కూడా టిడిపి కాంట్రాక్టర్లవే. చంద్రబాబు క్యాబినెట్ సమావేశం పెట్టాలని పట్టుబట్టటమే ఈ బిల్లుల క్లియరెన్సు కోసం. మరి మధ్యాహ్నం క్యాబినెట్ లో ఏం జరుగుతుందో చూద్దాం.