తల్లి ఓ జాతీయ పార్టీలో పెద్ద పొజిషన్ లో ఉన్నారు. కొడుకు మాత్రం తొందరలో ఓ ప్రాంతీయ పార్టీలో చేరబోతున్నారట. మధ్యలో ఇంటి యజమాని మౌనం. ఆయన రూటేమిటో ఎటైనా పోతారా, లేక ఉన్నచోటే ఉండరా; ఆయనకే తెలీదట. విచిత్రంగా లేదూ!
ఇంతకీ విషయం ఏమిటంటే, దగ్గుబాటి కుటుంబం గురించే ఇదంతా. దగ్గుబాటి పురంధేశ్వరి బిజెపిలో యాక్టివ్ గా ఉన్నారు. కొడుకు రాజకీయ అరంగేట్రం మాత్రం వైసిపి ద్వారా జరగబోతోందట. మరి దగ్గుబాటి వెంకటేటశ్వరరావు ఏం చేస్తారట ? ప్రస్తుతానికి అదే సస్పెన్స్.
చంద్రబాబు మీడియాలో వచ్చిన కథనాల ప్రకారమే దగ్గుబాటి దంపతుల కొడుకు హితేష్ చెంచురామ్ తొందరలో వైసిపిలో చేరుతున్నారట. ప్రకాశం జిల్లాలోని పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయటం ఖాయమైందట. దగ్గుబటి కుటుంబాన్ని వైసిపిలోకి తీసుకురావటానికి మాజీ మంత్రి, సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు గట్టి ప్రయత్నాలే చేశారట. అయితే చివరలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ప్రయత్నం ఫలించిందట. అందుకనే చెంచురామ్ ను వైసిపి తరపున పర్చూరులో పోటీ చేయించటానికి దగ్గుబాటు దంపతులు అంగీకరించారట.
కాకపోతే ఇక్కడ ట్విస్టేమిటంటే, భార్య పురంధేశ్వరేమో బిజెపిలోనే ఉంటారట. కొడుకేమో వైసిపిలో చేరుతారట. కానీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాత్రం రాజకీయాలకు దూరంగానే ఉంటారట. ఇదేమైనా జరిగేదానా ? రాష్ట్రంలో ఏమాత్రం భవిష్యత్తు కనబడని బిజెపిలో ఉండి పురంధేశ్వరి చేయగలిగేది ఏముంది ? రేపటి ఎన్నికల్లో పురంధేశ్వరి ఎక్కడి నుండి పోటీ చేస్తారు ? పోటీ చేసినా అసలు డిపాజిట్ వస్తుందా ? పోనీ పర్చూరులో పోటీ చేయబోతున్న చెంచురామ్ తరపున ఎన్నికల వ్యవహారాలను ఎవరు చూడాలి ? దంపతుల్లో ఎవరో ఒకరు దగ్గరుండి చూసుకోవల్సిందే కదా?
నామినేషన్ వేయించిన తర్వాత కొడుకు ఖర్మానికి కొడుకును వదిలిపెట్టలేరు కదా ? పురంధేశ్వరి ఒక చోట పోటీ చేసి, కొడుకు మరోచోట పోటీ చేస్తే మధ్యలో వెంకటేశ్వరరావు ఎవరి ఎన్నికను దగ్గరుండి చూసుకుంటారు ? కాబట్టి కొడుకు వైసిపిలో చేరటం ఖాయమైన తర్వాత దంపతులు కూడా వైసిపిలోకి వచ్చేయటం ఖాయమనే అనిపిస్తోంది. కాకపోతే ఓ నాలుగు రోజులు ఆలస్యమవుతుందేమో అంతే. దగ్గుబాటి కుటుంబం తొందరలో వైసిపిలో చేరబోతోందని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మరి చూడాలి చివరకు ఏం జరుగుతుందో ?