ఏమిటీ ఏపీ ఫైబర్ నెట్ స్కాం… చినబాబు పరిస్థితి ఏమిటి?

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ కు గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన తొలిదశ టెండర్లలో అక్రమాల జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ సమయంలో టెండర్ల కమిటీలో సభ్యుడిగా ఉన్న వేమూరి హరికృష్ణప్రసాద్‌, టెరా సాఫ్ట్‌ వేర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ ఎండీ తుమ్మల గోపీచంద్‌, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ అధికారులతో కలిసి అక్రమాలకు పాల్పడ్డారని ఎఫ్‌ఐఆర్‌ లో తెలిపింది.

ఈ క్రమంలో… ప్రాజెక్టు నిర్వహణకు అర్హతలు లేకున్నప్పటికీ టెరా సాఫ్ట్‌ వేర్‌ లిమిటెడ్‌ సంస్థకు అక్రమంగా రూ.321 కోట్లకు కాంట్రాక్టు అప్పగించారని పేర్కొంది. ఈ మేరకు టెండర్ల విషయంలో అక్రమాలు జరిగాయని సీఐడీ ఎఫ్.ఐ.ఆర్. లో ప్రస్తావించింది. అనంతరం హరికృష్ణ, సాంబశివరావు, గోపీచంద్‌ లను ఏపీ సీఐడీ విచారించింది.

వాస్తవానికి తొలిదశ టెండర్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ ఎండీ 2021 జులై 16న ఫిర్యాదు అందింది. దీంతొ ఈ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ చేపట్టిన సీఐడీ… 774 పేజీల నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదిక ఆధారంగా సెప్టెంబరు 9న కేసు నమోదు చేసింది. పలు సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది.

ఇదే సమయంలో ప్రాథమిక విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలిందని ఒక నివేదిక సిద్ధం చేసిన సీఐడీ… మొత్తం 19 మందిని కేసులో నిందితులుగా పేర్కొంది. నిబంధనలను విరుద్ధంగా టెరా సాఫ్ట్‌ వేర్‌ కంపెనీకి టెండర్లు కట్టబెట్టినట్లు సీఐడీ గుర్తించింది. బ్లాక్‌ లిస్ట్‌ నుంచి తొలగించి మరీ ఈ కంపెనీకి నకిలీ పత్రాలతో టెండర్లు ఫైనల్‌ చేసినట్లు ఏపీ సీఐడీ పేర్కొంది.

గతంలో ఏపీ సివిల్‌ సప్లైస్‌ కు సర్వీసులు అందించిన టెర్రాసాఫ్ట్‌ కంపెనీని… నాసిరకం ఈ- పాస్ మిషన్లు పంపిణీ చేసినందుకు ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టింది. అయితే బ్లాక్‌ లిస్ట్‌ లో ఉన్న టెర్రాసాఫ్ట్‌ ను రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే ఆ లిస్ట్ నుంచి తప్పించింది చంద్రబాబు సర్కార్. అనంతరం హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీతో కలిసి ఈ ప్రాజెక్టు దక్కించుకుంది టెర్రాసాఫ్ట్!

ఈ విధంగా టెండర్లు దక్కించుకున్న టెర్రాసాఫ్ట్… అనంతరం హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీని నిబంధనలకి విరుద్దంగా బయటకి పంపించేసింది. దీంతో హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనీల్ జైన్ ఈ మేరకు సీఐడీ ముందు స్టేట్ మెంట్ ఇచ్చారు. తమని మోసం చేసినట్టు వాంగ్మూలమిచ్చారు.

ఈ సమయంలో నిబంధనలకి విరుద్దంగా ఇంకో కంపెనీ నుంచి రూ.115 కోట్ల నాసిరకం మెటీరియల్‌ ను కొనుగోలు చేసిన టెర్రా సాఫ్ట్… ఆ నాసిరకం మెటీరియల్ ను ఫైబర్ నెట్‌ కు సరఫరా చేసిందని ఏపీ సీఐడీ ఎఫ్.ఐ.ఆర్. లో పేర్కొందని అంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సూచనల మేరకే టెర్రాసాఫ్ట్‌ వ్యవహరం మలుపులు తిరిగిందని ఏపీ సీఐడీ తేల్చిందని చెబుతున్నారు.

దీంతో ఫైనల్ గా ఫైబ‌ర్ నెట్ పేరుతో రూ.121 కోట్ల మేర అవినీతి జ‌రిగింద‌ని గుర్తించిన‌ సీఐడీ, చంద్ర‌బాబును ప్ర‌ధాన ముద్దాయిగా పేర్కొంటూ పీటీ వారెంట్ దాఖ‌లు చేసింది. దీంతో ఈ పిటీష‌న్‌ ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించిందని అంటున్నారు.

అయితే ఈ వ్యవహారంలో అప్పటి ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ పాత్రపై ఈప్పటికే పలు ఆరోపణ్లు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో… ఇప్పటికి చంద్రబాబుకు పీటీ వారెంట్ దాఖలు చేసిన నేపథ్యంలో… త్వరలో లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారంటూ బ్రాహ్మణి కామెంట్స్ చేసిన క్రమంలో… ఫైబర్ నెట్ లో చినబాబు పాత్రపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది!