తెలుగు రాష్ర్టాల్లో అగ్రగామి వార్తా ఛానళ్లగా ప్రసిద్దికెక్కిన ఓ రెండు ఛానళ్ల యాజమాన్యాల మధ్య వివాదాల నేపథ్యంలో రెండు ఛానళ్లు ఒకరిపై ఒకరు వాస్తవాలు బయటపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఒకరి లోపాల్ని ఒకరు ఎత్తి చూపుకుంటూ..ఒకరిపై ఒకరు దెప్పి పొడుచుకుంటూ సమాజంలో వార్తా ఛానళ్లు అంటే? ఇలా కూడా ఉంటాయా? అని ఓ సందేహం కల్గించాయి. వ్యక్తిగత వివాదం తలెత్తితే అసలు రూపం బయడపడుతుందని ఆరోజు మరోసారి వార్తా ఛానళ్ల పుణ్యమా అని బయటపడింది. రెండు మూడు రోజుల పాటు మిగతా ఛానళ్లకు కావాల్సిన స్టప్ దొరికినట్లైంది.
ఆ తర్వాతి కొద్ది రోజులుగా ఓ వార్త ఛానల్ ఉన్నట్టుండి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి భజనా కార్యక్రమం మొదలు పెట్టింది. అప్పటివరకూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని..ఆయన మంత్రి వర్గాన్ని ఏక పక్షాన పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసిన ఛానల్ ఆ వార్ తర్వాత వైసీపీ భజన తగ్గించి వార్తల్ని బ్యాలెన్స్ చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నాలుగు దశాబ్ధాల రాజకీయ అనుభవాన్ని నెత్తిన నేసుకుంది. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేక కథనాలు వేసి మెప్పుపొందే ప్రయత్నం చేసింది.
అప్పటివరకూ చంద్రబాబు విషయంలో కాస్త నెగిటివ్ గా ఉన్నట్లు అనిపించినా ఆ వార్ తర్వాత ఎందుకనో చంద్రబాబుని ఎత్తుకునే కార్యక్రమం పెట్టింది. చివరికి ఎలాగూ చంద్రబాబును బుట్టలో వేసినట్లుంది. ఇక మరో ఛానల్ మొదటి నుంచి చంద్రబాబు నాయుడుకి బాకా కొడుతూనే ఉంటుందన్నది తెలిసిందే. అయితే ఆ రెండు ఛానళ్ల వార్ నేపథ్యంలో ఆయా యాజమాన్యాలు రెండు ఇటీవల చంద్రబాబు ముందుకు పంచాయతీకి వెళ్లాయట. చంద్రబాబు ముందు ఎవరి వాదనలు వారు వినిపించడం జరిగిందిట. ఈ సమావేశం ఓ ప్రముఖ రాజకీయ వేత్త ఇంట్లో రహస్యంగా జరిగినట్లు సమాచారం. ఈ పంచాయతీకి కేవలం ఎనిమిది మంది కీలక సభ్యుల మధ్యనే జరిగిందిట. మరి చర్చలు సఫలం అయ్యాయా? విఫలం అయ్యాయా? అన్న విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు.