తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నెటిజన్లు ఓ ముద్దు పేరు పెట్టారు. `బిల్డప్ బాబు` అని. చంద్రబాబు చేస్తోన్న వృధా ప్రయత్నాలను చూస్తోంటే.. నెటిజన్లు మంచి బిరుదే ఇచ్చారనిపిస్తోంది. ఆజన్మ శతృవైన కాంగ్రెస్‌లో కలిసిపోయిన చంద్రబాబు కొంతకాలంగా బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకులను కలుస్తున్నారు. వారందరినీ కాంగ్రెస్ జెండా కిందికి తీసుకుని రావాలనేది ఆయన ప్రయత్నం.
`కాంగ్రెస్‌తో మాకు కుదరదు మొర్రో` అని మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, అఖిలేష్ యాదవ్, మాయావతి వంటి నాయకులు మొత్తుకుంటున్నా ఆయన వినిపించుకోవట్లేదు. ఎక్కే గడప దిగే గడప అన్నట్లు తయారైంది ఆయన పరిస్థితి. చంద్రబాబు భాషలోనే చెప్పాలంటే కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారాయన. తనది వృధా ప్రయాసే అని చంద్రబాబు కూడా బాగా తెలుసు.
అయినప్పటికీ- ఏదో చేస్తున్నానని చెప్పుకోవడానికి ఇలా ప్రవర్తిస్తున్నారడంలో సందేహాలు అనవసరం. వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉత్తర్‌ప్రదేశ్‌లో బలంగా ఉన్న సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్‌వాది పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఇక్కడ కాంగ్రెస్‌కు అవకాశమే ఇవ్వలేదు. మరి చంద్రబాబు ఎందుకంతలా తొందరపడ్డారో తెలియదు.
ఎస్పీ నేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, బీఎస్పీ నేతలతో కలిసి పొత్తుల అంశంపై చర్చించారు. శుక్రవారం లక్నోలో కొనసాగిన ఈ సమావేశాల్లో సీట్ల సర్దుబాటు కుదిరినట్లు రెండు పార్టీల నాయకులు ప్రకటించారు. అసెంబ్లీ ఉప ఎన్నికలతో పాటు లోక్‌సభకు ఉమ్మడిగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ చెప్పిన ఓ మాట.. చంద్రబాబు గాలి తీసినట్టయింది.
`ఇప్పుడు మా లెక్కలు సరిపోయాయి. మా మేథమేటిక్స్‌లో నూటికి నూరు మార్కొలొచ్చాయి. ఇప్పటిదాకా చేసిన ప్రయత్నాలన్నీ ఫలించలేదు. అవి వృధా ప్రయాసలే. కాంగ్రెస్‌తో జట్టు కట్టి ఎన్నికలకు వెళ్లాలని మేము అనుకోవట్లేదు. ఎస్పీ-బీఎస్పీ ఎలాంటి మేజిక్ చేసిందో.. మొన్నటి ఉప ఎన్నికల్లో చూశారు. అలాంటి ఫలితాలనే లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ సాధిస్తాం..` అంటూ అఖిలేష్ యాదవ్ చెప్పారు.
చంద్రబాబు చేసినవి వృధా ప్రయత్నాలేనని ఆయన చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు కుదిరేది కాదని తేల్చిచెప్పారు. ఈ లెక్కన చూసుకుంటే ఎస్పీ, బీఎస్పీ.. కాంగ్రెస్‌ను దూరం పెట్టినట్టే.
తాము కూడా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే కూటమిలో చేరబోమని ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ కూడా కుండబద్దలు కొట్టారు. సో- ఇంకో వికెట్ పోయినట్టే. ఇక చంద్రబాబుకు మిగిలిన ఆశ అంతా మమతా బెనర్జీ, స్టాలిన్, దేవేగౌడ, ఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్, కమ్యూనిస్టుల మీదే ఉంది. కాంగ్రెస్‌ను ఛీ కొట్టి తృణమూల్ కాంగ్రెస్ పేరుతో వేరుకుంపటి పెట్టుకున్నారు మమతా బెనర్జీ.
ఇప్పుడామె చంద్రబాబు మాట విని కాంగ్రెస్ కూటమిలో చేరతారనుకోవడం భ్రమే. మిగిలింది స్టాలిన్, దేవేగౌడ. దేవేగౌడ పార్టీ ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ ఇస్తోన్న మద్దతుపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అది ఎప్పుడు కూలుతుందో తెలియదు. దీని ప్రకారం చంద్రబాబు వెంట కలిసి వచ్చేది నికరంగా ఒక్క స్టాలిన్ మాత్రమే.
ఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్‌లు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో కలిసే ఉన్నారు. చంద్రబాబు కొత్తగా వారిద్దరినీ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడం అంటే అదేదో నాటు సామెతను గుర్తు చేసినట్టవుతుంది. దీనికోసం ఆయన ఎగేసుకుంటూ వెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయారు. ఈ విషయంలో చంద్రబాబు అత్యుత్సాహాన్ని చూపారనే అనొచ్చు.
ఆ ఉత్సాహం కాస్తా తెలంగాణ ఎన్నికల్లో నీరుగారిపోయింది. అలాగని చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏర్పాటు అవుతుందని చెప్పుకొనే `ఫెడరల్ ఫ్రంట్`లో చేరడానికి దారి లేదు. చంద్రబాబుపై మొన్నటికి మొన్నే కేసీఆర్ ఎన్ని మాటలు అన్నారో మనం చూశాం, విన్నాం. చంద్రబాబును ఫెడరల్ ఫ్రంట్‌లో చేర్చుకుని కేసీఆర్ తన చాప కింద తానే నీరు తెచ్చుకుంటారని ఎవరూ అనుకోరు.