అనూహ్యమైన పరిణామమే ఇది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అలాగే, సాక్షి మీడియాకి చాలా పెద్ద షాక్ ఇచ్చారు.. అదీ మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి.
‘చిన్నాన్న చాలా మంచివాడు.. ఆయన సౌమ్యుడు.. ఆయన ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేలా కొన్ని మీడియా సంస్థలు వ్యవహరిస్తున్నాయి..’ అంటూ పరోక్షంగా సాక్షి మీడియాపై మండిపడ్డారు వైఎస్ షర్మిల. అంతే కాదు, ఆస్తి కోసం హత్య చేయాల్సి వస్తే, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి తొలుత చంపాల్సింది సునీతా రెడ్డినంటూ వ్యాఖ్యానించారు.
‘ఆస్తులన్నీ సునీత పేరు మీదనే వున్నాయి. చిన్నాన్న పేరు మీద ఆస్తులేమీ లేవు. ఒకటీ అరా ఆస్తులేమైనా వున్నా.. అవి సునీత పిల్లలకు చెందేలా వీలునామా రాశారు..’ అంటూ వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు.
కానీ, వైసీపీ వాదన వేరేలా వుంది. ఆస్తి కోసమే వైఎస్ వివేకా హత్య జరిగిందనీ, వైఎస్ వివేకానంద రెడ్డిని ఆయన కుమార్తె, అల్లుడు చంపించేశారనీ వైసీపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు న్యాయస్థానానికి కూడా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపిన సంగతి తెలిసిందే.
సోషల్ మీడియా వేదికగా వైసీపీ, వైఎస్ వివేకానంద రెడ్డి ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తోంది గత కొంతకాలంగా. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల అనూహ్యంగా ఈ వ్యవహారంపై పెదవి విప్పడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
వైఎస్ షర్మిల నుంచి ఈ తరహా స్పందనను ఎవరూ ఊహించి వుండరు.