పవన్ కల్యాణ్ కాళ్లూ, చేతులూ చంద్రబాబు కట్టేశారా?

పవన్ కల్యాణ్ అంటే ఓ ఆవేశం.. ఓ ఫైర్ అని అంటుంటారు. తప్పు జరిగితే, ప్రధానంగా మహిళల రక్షణ విషయంలో ఆయన ఆలోచన వేరే లెవెల్ అని చెబుతుంటారు. ఎక్కడ అక్రమం, దారుణం జరిగినా పవన్ సీరియస్ గా రియాక్ట్ అవుతారని చెబుతుంటారు. వాటిని నిజం చేస్తూ తాజాగా నరసాపురం ఎంపీడీవో అదృశ్యంపై పవన్ కల్యాణ్ సీరియస్ గా స్పందించారు.

అవును… నరసాపురం అదృశ్యంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్‌ గా స్పందించారు. ఎంపీడీవో అదృశ్యం, అందుకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. అదృశ్యమైన అధికారి ఆచూకీ కనిపెట్టే చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు.

ఇదే సమయంలో… వెంకట రమణారావు రాసిన లేఖ, అందులోని అంశాలపై పవన్ ఆరాతీశారని తెలుస్తోంది. అయితే… ఇందులో ఫెర్రీ కాంట్రాక్టర్ బకాయిల అంశాన్ని లేఖలో ప్రస్తావించారనే విషయాన్ని అధికారులు.. పవన్ దృష్టికి తీసుకొచ్చారట. దీంతో… ఓ అధికారి అదృశ్యమయ్యే పరిస్థితికి కారకులైనవారిపై చట్టప్రకారం చర్యలకు ఉపక్రమించాలని పవన్ ఆదేశించారని అంటున్నారు.

ఆ సంగతి అలా ఉంటే… ఓ ప్రభుత్వ ఉద్యోగి అదృశ్యం అయితే దానికిపై పవన్ ఇలా సీర్యస్ గా రియాక్ట్ అవ్వడంపై పలువురు అభినందిస్తున్నారు. ఇదే సమయంలో… ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మూడు హత్యలు, ఆరు రేప్ లు అన్నట్లుగా మారిపోయిన విషయంపై స్పందించడం లేదని మరికొంతమంది తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి.. ఆ బాలిక తల్లితండ్రులకు చివరి చూపు దక్కుతుందో లేదో అనేలా పరిస్థితి ఉన్న అంశంపై మాత్రం… “అది చదివి చాలా బాధపడ్డాను” అన్నట్లుగా రియాక్ట్ అవ్వడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదే క్రమంలో విజయనగరం, గుంటూరు జిల్లాల్లో కూడా బాలికపై దారుణాలు జరిగాయి.

ఇక తాజాగా వినుకొండలో జరిగిన ఘటన కూటమి ప్రభుత్వానికి చెరుపుకుందామన్న పోని మరక లా ఉండిపోయే అవకాశాలున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంపైనా పవన్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఇప్పటివరకూ రాలేదు! దీంతో… తన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అంశాలపై మాత్రమే స్పందించేలా.. పవన్ కు చంద్రబాబు కండిషన్స్ పెట్టారా అనే చర్చ తెరపైకి వచ్చింది.

ఎందుకంటే… ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో మహిళల రక్షణ అంటే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ పవన్ పేల్చిన భారీ డైలాగులు, ఆవేశంతో చేసిన ప్రసంగాలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. మరి అలాంటి పవన్ కల్యాణ్ ను మూడు నాలుగు శాఖలకు మంత్రిని చేసి చంద్రబాబు.. కాళ్లూ, చేతులూ కట్టేశారా అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి! మరి ఇలాంటి కామెంట్లు ఎప్పుడు ఆగుతాయనేది వేచి చూడాలి!