వినాయక చవితి.. వైసీపీ సర్కారు ఓడిందా.? గెలిచిందా.?

ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయమూ వివాదాస్పదమే అవుతోందంటే, ప్రభుత్వ పెద్దలు తమ నిర్ణయాల విషయమై ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలన్నమాట. కోర్టులు పదే పదే మొట్టికాయలేస్తున్నా ప్రభుత్వ పెద్దల తీరులో మార్పు రావడంలేదన్న విమర్శలున్నాయి. మరోపక్క, కోర్టులే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయన్న ఆక్రోశం అధికార పార్టీ నుంచి కనిపిస్తోంది. అది వేరే సంగతి. వినాయక చవితే వేడుకల విషయానికొస్తే, ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురయ్యింది.. ప్రైవేటు స్థలాల్లో చవితి వేడుకలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగని, ఇది పూర్తిగా ప్రభుత్వానికి మొట్టికాయ కాదు. బహిరంగ ప్రదేశాల్లో.. అంటే పబ్లిక్ ప్రాంతాల్లో వేడుకలు సబబు కాదని చెప్పడం ద్వారా ప్రభుత్వ నిర్ణయాన్ని కొంతమేర హైకోర్టు సమర్థించినట్లయ్యింది.

నిజానికి, ప్రభుత్వమే ఈ వెసులుబాటు కల్పించి వుంటే.. ఎవరూ కోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేసేవారు కాదేమో. కరోనా నిబంధనలు పాటిస్తూ, తక్కువమందితో వేడుకలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం చెప్పి వుంటే బావుండేది. అలా జరగకపోవడం వల్లే, కోర్టు.. వేడుకల నిర్వహణకు కాస్త వెసులుబాటు కల్పించాల్సి వచ్చింది. వైఎస్సార్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగినప్పుడు.. సినిమా థియేటర్లు.. పబ్లిక్ పార్కులు జనంతో కిటకిటలాడుతున్నప్పుడు.. వినాయక చవితి వేడుకలకే ఎందుకీ ఆంక్షలు.? అన్న ప్రశ్నకు ప్రభుత్వ పెద్దలే సరైన సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఎందుకొచ్చింది.. అన్న ఆత్మ విమర్శ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నవారు చేసుకోవాలి. నిర్ణయాలు తీసుకోవడంలో తలెత్తుతున్న సమస్యలు.. అధికార పార్టీ మీద అనవసరమైన విమర్శలకు కారణమవుతున్నాయి. అందునా, ప్రభుత్వం మీద విమర్శలు రావడం అస్సలేమాత్రం ఆహ్వానించదగ్గ విషయం కాదు. సమాజంలో అలజడికి ఇలాంటి నిర్ణయాలు కారణమవుతున్నాయి.