టీడీపీ కీలక నేత గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వెళతారనే వార్తలు పెద్ద ఎత్తున వస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకు ఇలాంటి వార్తలే వచ్చినప్పుడు గంటా వెంటనే స్పందించి వాటిని ఖండించారు. కానీ ఇప్పుడు మాత్రం పార్టీ మార్పుపై ఆయన స్పందించలేదు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న గంటాకు సీఎం నుండి కూడా గ్రీన్ సిగ్నల్ అందిందట. మొదటి నుండి వైసీపీలో కీలక నేత విజయసాయిరెడ్డికి గంటా అంటే అస్సలు గిట్టదు. టీడీపీలోని కీలక లీడర్లను టార్గెట్ చేసే విజయసాయి జాబితాలో గంటా కూడా ఉన్నారు.
అందుకే ఆయన మీద నేరుగానే కాకుండా అవంతి శ్రీనివాస్ లాంటి శిష్యుల చేత కూడా విమర్శలు, ఆరోపణలు చేయించేవారు. ఇక రాజకీయంగా చూసుకుంటే గంటా విశాఖలో బలమైన నేత. గత ఎన్నికల్లో నియోజకవర్గం మార్చుకుని విశాఖ నార్త్ నుండి పోటీ చేసి విజయం సాధించారు. విశాఖ రాజకీయ వర్గాల్లో, పారిశ్రామిక వర్గాల్లో గంటాకు మంచి పలుకుబడి ఉంది. ఆయనే గనుక వైసీపీలో చేరితే ఇన్నాళ్లు వైసీపీ తరపున విశాఖ రాజకీయాలు చూస్తున్న విజయసాయి, అవంతి లాంటి వాళ్లకు పోటీగా తయారవుతారు. అందుకే విజయసాయి గంటాను పార్టీలోకి రానివ్వకూడదని బాగా ట్రై చేశారట.
కానీ గంటా వేరొక దారి పట్టుకున్నారు. అదే సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల ద్వారా అధిష్టానాన్ని అప్రోచ్ అయిన గంటా వైసీపీలో చేరడానికి లైన్ క్లియర్ చేసుకున్నారట. సజ్జల సపోర్ట్ ఉండటంతో గంటాను ఎవరూ ఆపలేరని టాక్. ఇక కరోనా సోకడంతో విజయసాయి ప్రస్తుతం హైదరాబాద్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇంకొన్ని రోజులు ఆయన ఎవరికీ అందుబాటులోకి రాలేరు. కాబట్టి ఈ సమయం గంటాకు బాగా కలిసొచ్చిందనే అనుకోవాలి. ఈలోపు ఆయన పార్టీ మారడానికి ఏర్పాట్లు ముగించుకోవచ్చు. రాజకీయ వర్గాల టాక్ నిజమై గంటా గనుక ఆగష్టు 15న వైసీపీలో చేరితే విజయసాయి, అవంతిలకు పోటీగా మారడం ఖాయం.