అంధ్రాలో వరుసగా దుర్ఘటనలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. విశాఖ, విజయవాడలో ప్రమాదాలు, హిందూ ఆలయాలపై దాడులు. ఇలా నిత్యం ఏదో ఒక సమస్య. అంతర్వేది రథం దగ్దదమైన ప్రమాదం తీవ్ర సంచలనం రేపింది. ఈ దుర్ఘటనతో హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీని వెనుక ఏదో కుట్ర ఉందని జనం అంటుండగా కొందరు మతం రంగు పులిమే పనిలో ఉన్నారు. అలాగే ప్రతిపక్షం టీడీపీ ఇది పాలకవర్గం నిర్లక్ష్యమని, సమగ్ర విచారణ జరపాలి అంటుంటే పాలకవర్గం ప్రతిపక్షం అసత్య ప్రచారం చేస్తోందని మండిపడుతోంది. ఇలా ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటుండగా ఈలోపు అధికార పార్టీ నేత, వైసీపీలో నెంబర్ 2 అయిన విజయసాయిరెడ్డిగారు రథాన్ని తగులబెట్టింది అతనే అంటూ ఒకర పేరు హింట్ ఇచ్చారు.
హింట్ అనడం కంటే నేరుగా పేరే చెప్పేశారని అనడం కరెక్ట్. ట్విట్టర్లో విజయసాయి ఈ విధంగా ట్వీట్ చేశారు. ‘తునిలో రైలు, అమరావతిలో తోటలు తగలబెట్టించి, విజయవాడలో గుడులు కూల్చి, అమరేశ్వరుడి భూములు మింగి, పుష్కరాల్లో 7వేల కోట్లు ఆరగించి, దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయించి, అంతర్వేదిలో రథానికి నిప్పు పెట్టించాడు. పాప భీతి, దైవ భక్తి ఏనాడూ లేనివాడు. ఆ బాబే హిందుత్వంపై దాడులకు మూలకారకుడు’. అధికార పార్టీ నేతలు మేం చెప్పేవన్నీ నిజాలే అంటుంటారు. కాబట్టి విజయసాయిరెడ్డి చెబుతున్నట్టు ఆ బాబే రథాన్ని తగులబెట్టించారనే విజయసాయి స్టెట్మెంట్ ను వైసీపీ మొత్తం ఆమోదించినట్టే అనుకోవాలేమో.
మరి ఆ బాబే రథానికి నిప్పు పెట్టించాడనడానికి ఆధారాలేమైనా ఉన్నాయేమో విజయసాయిగారే చెప్పాలి. అయినా కేసు విచారణ జరుగుతుండగా ఇలా వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి నేరం వారే చేశారని రూఢీ చేయడం అంటే విచారణకు అడ్డుపడటమే కదా. కొన్నిరోజుల క్రితం స్వర్ణ ప్యాలెస్ ఘటన గురించి హీరో రామ్ మాట్లాడితే పోలీసులు ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. మరిప్పుడు కూడ మధ్యలోకి వచ్చి నేరం చేసింది ఆ బాబే అంటున్న సాయిరెడ్డికి కూడ పోలీసులు వార్నింగ్ ఇస్తారో లేకపోతే అంత బలంగా చెబుతున్నారు కాబట్టి ధారాలుంటే పంపమని అడుగుతారో చూడాలి.