విజయసాయి ట్వీటే సమాధానమా ?

అక్రమ కట్టడాలను సక్రమం చేయమంటూ చంద్రబాబునాయుడు రాసిన లేఖకు విజయసాయిరెడ్డి ట్వీటే సమాధానం అని అనుకుంటున్నారు. ఉండవల్లి కరకట్టపైన నిర్మించిన అక్రమకట్టడాల్లో ఒకదాన్ని చంద్రబాబు సిఎంగా ఉన్నపుడు క్యాంపు ఆఫీసుగా చేసుకున్నారు. అక్రమ కట్టడంలో క్యాపు ఆఫీసు పెట్టుకోవటమే కాకుండా ప్రజా వేదిక పేరుతో మరో అక్రమ కట్టడాన్ని ప్రభుత్వమే నిర్మించింది.

మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన తర్వాత ఐదేళ్ళు తానున్న అక్రమకట్టడంతో పాటు ప్రజావేదికను కూడా తనకే కేటాయించాలంటూ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు లేఖ రాయటంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అక్రమకట్టడాల్ని నియంత్రించాల్సిన చంద్రబాబే వాటిని ప్రోత్సహించటమేంటని చాలామంది మండిపడుతున్నారు.

చంద్రబాబు ఇంత దిగజారిపోయి ఆలోచిస్తాడా ? అంటూ నెటిజన్లు ఉతికిపారేస్తున్నారు సోషల్ మీడియాలో. దానికి సమాధానంగా వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్లో చంద్రబాబును ఉతికారేశారు. 40 ఏళ్ళ అనుభవం చివరకు విలాసవంతమైన అక్రమకట్టడాల్ని సక్రమం చేసుకోవాలన్న ఆలోచనకే ఉపయోగపడుతోందా ? అంటూ నిలదీశారు.

దానికితోడు గడచిన ఐదేళ్ళల్లో జగన్ కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలపై ఎన్నోసార్లు చంద్రబాబును నిలదీశారు. అయినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఇపుడు అక్రమకట్టడాల్ని తొలగించే అవకాశం జగన్ కే వచ్చింది. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు లేఖకు జగన్ ఏమని సమాధానమిస్తారో చూడాల్సిందే. అందుకు విజయసాయిరెడ్డి లేఖే జగన్ ఆలోచన అంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.