ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి ఊహించని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన ఆయన ఇప్పుడు పూర్తిగా దూరమయ్యారు. కేవలం దూరమవ్వడమే కాదు, తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. జగన్ రాజకీయ శైలిలో మార్పు వచ్చిందని, ఆయన చుట్టూ ఓ వర్గం ఏర్పడి పార్టీని పూర్తిగా నియంత్రిస్తున్నారని సాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
వైసీపీని వీడే ముందు లండన్‌లో ఉన్న జగన్‌ను సంప్రదించినట్లు చెప్పిన సాయిరెడ్డి, తాను గమనించిన విషయాలను ఆయనకు వివరించినా, స్పందన నిరాశపరిచిందని తెలిపారు. పార్టీ నుంచి వెళ్లొద్దని జగన్ సూచించినా, తన నిర్ణయం అప్పటికే ఖరారైందని స్పష్టం చేశారు. అంతేకాకుండా, తనపై లంచాల ఆరోపణలు చేయించారని, తాను అలాంటి వ్యక్తిని కాదని జగన్‌కే చెప్పినట్లు వెల్లడించారు. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని తాను బలమైన నిర్ణయం తీసుకున్నానని, ఇక మళ్లీ ఏ పార్టీలోనూ చేరే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు.
ఒకప్పుడు జగన్‌తో అత్యంత సన్నిహితంగా ఉన్న సాయిరెడ్డి, ఆయనలో వచ్చిన మార్పు తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. జగన్ చుట్టూ కోటరీ పెరిగిపోయి, పార్టీ పరిపాలన పూర్తిగా మారిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు పార్టీకి నిబద్ధతతో పనిచేసిన తనలాంటి వ్యక్తికి సరైన గౌరవం దక్కలేదని, తన మనసు విరిగిపోయిందని వ్యాఖ్యానించారు.
సాయిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేడెక్కిన తరుణంలో, జగన్‌పై ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక నుంచి సాయిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటారా? లేదా మరో కీలక నిర్ణయం తీసుకుంటారా? అన్నది ఆసక్తిగా మారింది.