చంద్రబాబు జారి పడతారని విజయసాయిరెడ్డికెలా తెలిసింది.?

రామా.. అంటే, బూతుగా వినిపించే రోజులివి. ఏదో యధాలాపంగా వేసిన ఓ ట్వీటుని, ‘ముందస్తు కుట్ర’గా అభివర్ణిస్తే ఎలా.? రాజకీయాలంటేనే అంత.!
వైసీపీ ఎంపీ (రాజ్యసభ) విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో నిన్న ఓ ట్వీటేశారు.

అదీ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయు మీద. ‘వెన్నుపోట్లతో అడ్డదారిలో రాజకీయ శిఖరాగ్రానికి చేరి ఇప్పుడు బాధితుడిగా మారి అక్కడి నుంచి జారి పడడమే జరగబోయే పరిణామం. కాలం మీ పాపాలను మరుగుపరిచినా…కర్మ వదలదు…అది వెంటాడుతూనే ఉంటుంది చంద్రబాబు!’ ఇదీ ఆ ట్వీటు.

ఇందులో ‘జారి పడటం’ అనే విషయాన్ని టీడీపీ సీరియస్‌గా తీసుకుంది. ఎందుకంటే, చంద్రబాబు గోదావరి వరద బాధితుల్ని పరామర్శించే క్రమంలో జారిపడ్డారట. చంద్రబాబు పడిపోలేదుగానీ, చాలామంది టీడీపీ నేతలు తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నారు.

దాంతో, టీడీపీ నేతలిప్పుడు విజయసాయిరెడ్డిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ‘టీడీపీ నేతల్ని చంపేయడానికి వైసీపీ కుట్ర పన్నింది. అందుకే, జారిపడటం గురించి విజయసాయిరెడ్డి ముందే ట్వీటేశారు..’ అంటూ టీడీపీ గుస్సా అవుతోంది.

అసలు, ట్వీటులో విజయసాయిరెడ్డి పేర్కొన్న ‘జారి పడటానికి’, జరిగిన ఘటనలో ‘జారి పడటానికీ’ ఎంత తేడా వుంది.? దానికీ, దీనికీ సంబంధం లేకపోయినా.. అనుమానాలైతే వ్యక్తం చేసేస్తున్నారు టీడీపీ నేతలు. ఇంకెందుకు ఆలస్యం.? ఈ ఘటనపై సీబీఐ విచారణ కోరితే పోలా.? ఏమో, చంద్రబాబు అండ్ టీమ్.. ఆ పని చేసినా చేస్తారు.!