టివి9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ను మీడియా నయీంగా అభివర్ణించారు విజయసాయిరెడ్డి. ఈమధ్య వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చంద్రబాబునాయుడు అండ్ కో తో పాటు రవిప్రకాశ్ ను ట్విట్టర్లో వాయించేస్తున్నారు. ప్రత్యర్ధులపై విజయసాయి చేస్తున్న ట్వీట్లు సంచలనాలుగా మారుతున్నాయి. గతంలో ఎన్నడూ విజయసాయి ఈ విధంగా ప్రత్యర్ధులపై ట్విట్టర్లో విరుచుకుపడింది లేదు.
తాజాగా తన ట్విట్టర్లో రవిప్రకాశ్ పై మండిపడ్డారు. రవిని విజయసాయి మీడియా నయీం అంటూ సంభోదించటం సంచలనంగా మారింది. ‘పోలీసులు వస్తే ఇంట్లో కనిపించడు…నోటీసులకు స్పందించడు…అదే సమయంలో తాను పరారీలో లేనంటాడు..పోలీసులు, కోర్టులు, చట్టాలు తనంతటి ప్రవక్తను టచ్ చేయలేవన్న భ్రమల్లో ఉన్నాడు’ అంటూ ఎద్దేవా చేశారు.
ముందస్తు బెయిల్ పీటీషన్ ను కోర్టు కొట్టేసిన నేపధ్యంలో మీడియా నయీంను ఏ ‘బాబు’ రక్షిస్తాడో చూడాలి అంటూ వ్యంగ్యోక్తులు విసిరారు. విచారణకు రమ్మంటూ పోలీసులు ఇంటికి నోటీసులు అంటిస్తుంటే ఈ ప్రవక్త గోడదూకి ఇంట్లో నుండి పారిపోయాడంటూ ఎంపి ఎద్దేవా చేశారు.
పనిలో పనిగా చంద్రబాబునాయుడు పైన కూడా ఎంపి సెటైర్లు వేశారు. సొంత పార్టీ నేతలు ఎక్కడికక్కడ వెన్నుపోట్లు పొడిచారంటూ తమ్ముళ్ళు బావురుమంటుంటే వారిని ఎలా ఓదార్చాలో చంద్రబాబుకు అర్ధం కావటం లేదన్నారు. సమీక్షల్లో నేతలకు ధైర్యం నూరిపోయటం సంగతి సరే, సమీక్షలు ఇలాగే సాగితే కౌంటింగ్ నాటికి కొంప కొల్లేరే అన్న భయంతోనే సమీక్షలను రద్దు చేశారంటూ ట్విట్లర్లో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.