శ్వేతపత్రం… చంద్రబాబుకు వైసీపీ ఆసక్తికర డిమాండ్!

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ఎంత శ్రద్ధ పెట్టారనే సంగతి కాసేపు పక్కనపెడితే… చంద్రబాబు శ్వేతపత్రాలు మాత్రం విడుదల చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయని, అవినీతి జరిగిందంటూ ఆ శ్వేతపత్రాల విడుదల సందర్భంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

దీంతో.. ఈ ఐదేళ్లు చంద్రబాబు ఇలానే కాలం గడిపేస్తారా అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే… ఏపీలో ప్రభుత్వం మారిన తర్వత జరిగిన పరిణామాలపైనా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తుంది వైసీపీ. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఈ వ్యవహారంపై శ్వేతపత్రం అవసరమని స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి స్పందించారు.

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత గత 45 రోజుల్లో 36 హత్యలు జరగగా.. 300కి పైగా హత్యాయత్నాలు జరిగాయని, టీడీపీ వేధింపులు తట్టుకోలేక 35మంది ఆత్మహత్యలు చేసుకున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. ఇదే సమయంలో.. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తుల్ని, 560 ప్రాంతాల్లో ప్రైవేటు ఆస్తుల్ని ధ్వంసం చేశారని చెబుతున్నారు. ఇక దౌర్జన్యాలు అయితే వెయ్యి పైనే అనేది బలంగా వినిపిస్తున్న మాట.

వాస్తవానికి ఇప్పటివరకూ చంద్రబాబు చాలా శ్వేతపత్రాలే విడుదల చేశారు. అయితే… తాజాగా శాంతిభద్రతలపైనా శ్వేతపత్రం విడుదల ఏయడానికి సిద్ధపడ్డారు! కానీ… ఈ విషయంలో చంద్రబాబు వెనక్కి తగ్గారు. దీంతో… శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసే సాహసం చేయలేకపోయారు.. బౌన్స్ బ్యాక్ అవుతాదని జంకారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ సమయంలో… ప్రతిపక్షం వైసీపీ నుంచి శ్వేతపత్రంపై డిమాండ్ వినపడుతోంది. ఈ మేరకు… వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, నెలరోజుల అరాచకంపై నిజానిజాలు బయటపెట్టాలని లోకేష్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ టార్గెట్ గ దాడులు పెరుగుతున్నాయని.. ఆక్రమణలంటూ వైసీపీ ఆఫీసుల్ని కూల్చేస్తున్నరని వైసీపీ ఆరోపిస్తుంది.

ఇక వ్యక్తిగత దాడులు అవిరమంగా కొనసాగుతున్నాయని.. వినుకొండలో జరిగిన హత్య వీటన్నింటికీ పరాకాష్ట అని వైసీపీ నిప్పులు చెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఈ అరాచకాలపై ప్రభుత్వం స్పందించకపోవడాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే… రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీలు, దొమ్మీలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇందులో భాగంగా… “నారా లోకేష్.. రాష్ట్రంలో గత నెల రోజుల్లో జరిగిన రావణకాష్టం గురించి జిల్లాల వారీ జరిగిన హత్యలు, అత్యాచారాలు, దాడులు, దోపిడీలు, దొమ్మీల మీద ఒక శ్వేతపత్రం ఇవ్వాలి. అశ్వత్థామ హతః కుంజరః అనే మీ విధానం విడనాడండి. ఇలాగే కొనసాగితే టీడీపీ మనుగడకే ప్రమాదం లేకుంటే ఒక కులానికి ప్రాతినిధ్యం వహించే పార్టీగా చరిత్ర పుటల్లో నిలిచిపోవచ్చు” అని పోస్ట్ చేశారు.