తెలుగు రాజకీయాల్లో ఇటీవలి కాలంలోనూ కీలకంగా కనిపించిన పేర్లలో విజయసాయి రెడ్డి ఒకరు. వైసీపీ పార్టీలో కీలక నేతగా కొనసాగిన ఆయన పాలిటిక్స్ కు గుడ్ బై చెనుతున్నట్లు ప్రకటించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆయన రాజకీయ విధానం, సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు, వ్యక్తిత్వ హననం వంటి అంశాలతో బాగా చర్చనీయాంశమయ్యారు. ప్రత్యర్థులపై తనదైన శైలిలో విమర్శలు చేయడం, సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేయడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది.
విజయసాయి రాజకీయ ప్రత్యర్థులపై ధ్వజమెత్తినప్పుడు, విమర్శలు గుప్పించినప్పుడు, దారుణమైన భాషను వినియోగించి వివాదాస్పదంగా మారినప్పుడు, ఇది రాజకీయ వ్యూహం మాత్రమేనని భావించేవారు. కానీ ఈరోజు, ఆయన తెలుగుదేశం పార్టీతో రాజకీయ విభేదాలకే పరిమితమయ్యానని, చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు లేవని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇదే సమయంలో పవన్ కల్యాణ్‌పై గతంలో తీవ్రంగా విమర్శలు చేసిన విజయసాయి, ఇప్పుడు పవన్ తన చిరకాల స్నేహితుడని ప్రకటించడమంటే ఏం అర్థం?. ఈ పరిణామాలు విశ్లేషిస్తే, విజయసాయి తీరును పూర్తిగా మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో చేసిన వ్యాఖ్యలు, విమర్శలు రాజకీయ అవసరాలకే పరిమితమని ఆయన మాటల ద్వారా స్పష్టమవుతోంది. కానీ అప్పట్లో ఆయన వైఖరి, ప్రత్యర్థులపై విమర్శలు, వ్యక్తిగత వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో చేసిన హద్దుమీరి కామెంట్లు రాజకీయ వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి.
ఇప్పుడు ఈ విధానం తప్పు అని అర్థమై మార్పు చూపించాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాలకు దూరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారా?. ఇక ముందు తీవ్ర విమర్శలు చేసిన వారినే ఇప్పుడు స్నేహితులుగా ప్రకటించడం, వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని చెప్పడం రాజకీయాల్లో సాధారణంగా ఉండే మాటలగానే కనిపించినా, ఇది విజయసాయి రాజకీయం ముగిసిన సంకేతమా? లేదా కొత్త వ్యూహానికి నాంది? అనే చర్చ అందరిలోనూ మొదలైంది. ఎట్టకేలకు, తెలుగు రాజకీయాలపై విజయసాయి ప్రభావం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిందే.