న్యూ ఢిల్లీ: కరోనా బారిన పడిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆరోగ్యంపై సోమవారం కీలక ప్రకటన వెలువడింది. కరోనా జాగ్రత్తలతో అత్యంత సెక్యూర్డ్‌గా వున్న వెంకయ్య నాయుడుకు సెప్టెంబర్ 29న కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో అందరూ ఉలిక్కి పడ్డారు. అప్పట్నించి ఆయన, ఆయన సతీమణి.. ఇద్దరు హోం ఐసొలేషన్‌లో వుండి చికిత్స తీసుకున్నారు.
తాజాగా సోమవారం వెంకయ్య నాయుడు దంపతులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో వారిద్దరు కరోనా వైరస్ నుంచి కోలుకున్నట్లు తేలింది. ఇద్దరికీ నెగెటివ్ రిపోర్టు రావడంతో ఆయన అభిమానులు, బీజేపీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నారు. ఎయిమ్స్ వైద్య బృందం చేసిన ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో ఉపరాష్ట్రపతి దంపతులిద్దరికీ నెగెటివ్ ఫలితం వచ్చింది. వెంకయ్య నాయుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, వైద్యుల సూచనల మేరకు త్వరలోనే విధుల్లో పాల్గొంటారని ఉప రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
దేశంలో కరోనా ప్రభావం మొదలైనప్పట్నించి సామాజిక దూరం, మాస్కు వంటి నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ వస్తున్న వెంకయ్య నాయుడుకు కరోనా పాజిటివ్ వచ్చిందన్న వార్త సెప్టెంబర్ 29న ప్రసార మాధ్యమాల్లో వచ్చినప్పట్నించి ఆయన ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఆయన త్వరగా కోలుకోవాలని ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పలువురు పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన కోవిడ్‌ను ఎదుర్కొని, ఆరోగ్యంగా బయటపడడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.