వెంకయ్య నాయుడిని ఇరుకున పెట్టిన మంత్రులు!

రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించండి అంటే.. మీ చొరవతో కేంద్రం నుంచి నిధులు ఇప్పించండి అంటూ రాష్ట్ర మంత్రులు ఏకంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి లేఖ రాశారట. పనిలో పనిగా రాష్ట్ర రైతుల మీద, రాష్ట్ర అభివృద్ధి మీద మీరు చూపిస్తున్న శ్రద్ధకు ధన్యవాదాలు అంటూనే.. అదే అభిమానంతో నిధులు కూడా ఇప్పించండి అనడం చూస్తుంటే.. ఇది ఖచ్చితంగా వెంకయ్యనాయుడిని ఇరుకున పెట్టేందుకే చేసి ఉండొచ్చేమో..

విషయం ఏమిటంటే.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంగా పంట ఉత్పత్తుల కొనుకోలుకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వాల్సిందిగా సూచించారు. దీనికి సమాధానంగా రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, కన్నబాబు స్పందిస్తూ.. వెంకయ్య నాయుడికి ఓ లేఖ రాసినట్లు తెలుస్తోంది. అందులో ‘తెలుగు రైతులు, తెలుగు ప్రజల మీద మీకున్న ప్రత్యేక అభిమానం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఉపరాష్ట్రపతి అయినప్పటి నుంచి అభివృద్ధి పట్ల మీరు చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధకు ధన్యవాదాలు’ అంటూ వెంకయ్యను అభినందించి.. అలాగే ఆంధ్రప్రదేశ్ రైతులకు ధాన్యం సేకరణకు‌ సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన రూ.4,724 కోట్లు, పోలవరం ఆర్‌అండ్ఆర్ ప్యాకేజీ కోసం రావాల్సిన నిధులు ఇప్పించడంలోనూ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అక్కడితో ఆగక.. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఎగ్గొట్టిన రూ.960 కోట్ల బకాయిలు కూడా జగన్ ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని కూడా ప్రస్తావించారు.. మొత్తంగా ఇంగ్లీషు మీడియంపై వ్యాఖ్యలు చేసిన వెంకయ్య నాయుడిని వైసీపీ మంత్రులు ఇలా ఇరుకున పెట్టారన్నమాట.