పవన్ కల్యాణ్ అలా ఆలోచిస్తున్నారా… వెల్లంపల్లి గెస్సింగ్ వైరల్!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టై, రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పటినుంచీ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ ఉన్న అనంతరం పవన్ కల్యాణ్ పొత్తు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… బాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు గత మూడు వారాలుగా ప్రతీ శని లేదా ఆదివారాల్లో ఐదేసి నిమిషాలపాటు ఒక్కో వినూత్న కార్యక్రమం ప్లాన్ చేస్తున్న సంగతీ తెలిసిందే.

ఆ కార్యక్రమాల వల్ల టీడీపీకి వచ్చే మైలేజ్ ఎంత, బాబు అరెస్ట్ పై ప్రజల్లో వ్యక్తమవుతున్న నిరసన ఎంత అనే సంగతి కాసేపు పక్కనపెడితే… ఇందులో భాగంగా ఇప్పటివరకూ సెప్టెంబర్ 30న “మోత మోగిద్దాం”, అక్టోబర్ 7 న రాత్రి ఏడు గంటలకు లైట్లు ఆపేస్తూ “కాంతి క్రాంతి” వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇదే క్రమంలో అక్టోబర్ 15న “న్యాయానికి సంకెళ్లు” అనే కార్యక్రమాన్ని తాజాగా నిర్వహించారు.

ఇందులో భాగంగా ఎవరికి వారే సంకెళ్లు వేసుకుని ఐదు నిమిషాల పాటు నిరసన తెలిపారు! దీంతో తాజాగా ఈ కార్యక్రమంపై విజయవాడ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ఇందులో భాగంగా… తప్పుచేసిన టీడీపీ నేతలకు ఆ సంకెళ్లు పర్మినెంట్ గా పడతాయని ఆయన తెలిపారు! ఇదే సమయంలో… చంద్రబాబుకు ఆల్రెడీ సంకెళ్లు పడ్డాయి, తమకు కూడా సంకెళ్లు వేయండి అన్నట్లుగా టీడీపీ నేతలు “న్యాయానికి సంకెళ్లు” అనే కార్యక్రమం ద్వారా ముందుకు వచ్చారని వెల్లంపల్లి అభిప్రాయపడ్డారు.

ఇక వారానికి ఒకసారి రాత్రి 7 – 7:05 గంటల మధ్య కేవలం ఐదు నిమిషాల నిరసన కార్యక్రమం అని ప్రకటించినా కూడా స్పందన కరువవుతుందని వెల్లంపల్లిల్ ఎద్దేవా చేశారు! అనంతరం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైనా వెల్లంపల్లి తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఎలాంటి అనుమానం ఉన్నా, మరెలాంటి అభ్యర్థన చేయాలనుకున్నా కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు.

ఇప్పటికే ఏసీ కావాలని కోర్టుకి విన్నవిస్తే ఇచ్చారని గుర్తుచేసిన ఆయన… ఒకవేళ ప్రైవేటు వైద్యం కావాలని భావిస్తే దానికోసం కూడా కోర్టుకు వెళ్లాలని సలహా ఇచ్చారు. ఈ విషయంలో ఎందుకు మాట్లాడరు పవన్ అని ప్రశ్నించిన ఆయన… షూటింగుల్లో, ఫాం హౌసుల్లో బిజీగా ఉంటావంటూ సెటైర్లు వేశారు! ఇదే సమయంలో చంద్రబాబు విషయంలో పవన్ ముసలి కన్నీరు కారుస్తున్నారంటూ ఎద్దేవా చేశారు!

ఇదే క్రమంలో… చంద్రబాబు ఎప్పుడుపోతే అప్పుడు ఆ టీడీపీ ని జనసేనలో కలిపేసుకోవచ్చు.. లేదా, టీడీపీలో జనసేన ను కలిపేయొచ్చు అనే తపన పవన్ ది అని వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజంగా చంద్రబాబు మీద ప్రేమ ఉందా.. ప్రేమ ఉంటే కోర్టుకి వెళ్లి మెరుగైన వైద్యం అందించండి, ప్రైవేటు వైద్యశాలలో ట్రీట్ మెంట్ ఇప్పించండి అని అడగండి అని పవన్ కల్యాణ్ కు సూచించారు వెల్లంపల్లి శ్రీనివాస్.

దీంతో… పవన్ కల్యాణ్ మనసులో ఇంతుందా.. ఎన్టీఆర్ కి చంద్రబాబు చేసిన టైపులోనే… కాస్త అటుఇటుగా పవన్ కల్యాణ్, చంద్రబాబు విషయంలో చేయబోతున్నారా అనే చర్చ ఆన్ లైన్ వేదికగా మొదలయ్యింది!