వర్మ ఓవర్ యాక్షనే కారణమా ?

ఏపిలో అసలే పరిస్ధితులు బావోలేదు. ఏమాత్రం ఓవర్ యాక్షన్ చేస్తే పోలీసులు ఊరుకుంటారా ? సినీ దర్శకుడు రామ్ గోపాల వర్మ అరెస్టులో ఓవర్ యాక్షనే బాగా ఎక్కువగా కనబడుతోంది. ఓవర్ యాక్షనే చేయకపోతే వర్మను పోలీసులు అడ్డుకునే వారు కాదేమో ? ఇంతకీ వర్మ చేసిన ఓవర్ యాక్షన్ ఏంటంటే ‘నడిమీద రోడ్డు మీద ప్రెస్ మీట్’ పెడతానని ముందుగా ట్విట్టర్లో ప్రకటించటమే.

చంద్రబాబునాయుడు పాలనలో ఏపిలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే.  ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆందోళనలకే పోలీసులు అవకాశం ఇవ్వలేదు. జగన్ నిరాహార దీక్షలు చేస్తానంటే కూడా ముందుగా అనుమతిచ్చి మళ్ళీ రద్దు చేసిన ఘటనలున్నాయి. అలాంటిది పోలీసుల(ప్రభుత్వం) ముందు వర్మ ఎంత ?

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వర్మ గతంలో చాలా సార్లే ప్రెస్ మీట్లు పెట్టారు విజయవాడలో. ఎప్పుడు కూడా పోలీసులు అడ్డుకోలేదు. అలాగే ఎన్నో ఫంక్షన్లకు కూడా హాజరయ్యుంటారు. ఎన్నడూ ఆంక్షలు విధించలేదు. మరి ఇపుడే వర్మ ను ఎందుకు అడ్డుకుంది ?

ఎందుకంటే, ఇక్కడ వర్మ ఓవర్ యాక్షనే ఎక్కువగా కనిపిస్తోంది. పైపుల రోడ్డులో ఎన్టీయార్ సర్కిల్ దగ్గర నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ అని వర్మ చేసిన ట్వీట్ తోనే వివాదం మొదలైంది. నడిరోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టటం ఏంటి ? వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీయార్ బయోపిక్ రిలీజును ప్రభుత్వం అడ్డుకుంది. ఆ నేపధ్యంలో ప్రభుత్వానికి, వర్మకు మధ్య వివాదం నడుస్తోంది. కాబట్టి వర్మ ప్రతీ అడుగును ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలిస్తోంది.

తాజాగా వర్మ ప్రెస్ మీట్ అంటే బయోపిక్ విషయంలోనే అని ప్రభుత్వం అనుమానించింది. అందులోను నడిరోడ్డు మీద ప్రెస్ మీట్ పెడితే ఇంకెంత కంపవుతుందో అని అనుమానించటంలో ప్రభుత్వం తప్పులేదు. అందుకే వర్మను ప్రెస్ మీట్ పెట్టకుండా ముందుగానే అడ్డుకుంది. అదే వర్మ గనుక నడిరోడ్డు మీద ప్రెస్ మీట్ అని ముందుగా చెప్పకుండా ఉండుంటే పోలీసులు కూడా పట్టించుకునే వారు కాదేమో. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇటు వర్మకు కానీ అటు ప్రభుత్వానికి కానీ ఎటువంటి లాభం లేదు. కాకపోతే వర్మ ఓవర్ యాక్షనే ఎక్స్ పోజ్ అయ్యిందంతే.