కోస్తా ఆంధ్ర రాజకీయాల్లో ఇప్పటికీ ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తున్న పేరు వంగవీటి మోహన రంగ. విజయవాడ రాజకీయాల్లో ఒక వెలుగువెలిగిన రంగ కాంగ్రెస్ పార్టీ తరపున బలమైన నేతగా ఎదిగే సమయంలో హత్య గావించబడ్డారు. ఈ హత్యలో ఇప్పటికీ అనేకమంది ప్రముఖుల పేర్లు వినబడుతూనే ఉంటాయి. విజయవాడ నుండి రాజకీయం ఉప్పెనలా దూసుకొస్తున్న రంగాను నిలువరించాలనే ఉద్దేశ్యంతో అన్ని రకాల ప్రయత్నాలు చేసి వల్లకాక చివరికి హత్య చేశారని చెబుతుంటారు ఆయన అభిమానులు. ఈనాడు రంగా గనుక బ్రతికి ఉంటే తప్పుకుండా ముఖ్యమంత్రి అయిఉండేవారని, అలా అవుతారనే భయంతోనే మట్టుబెట్టారని అంటుంటారు. నిజా నిజాలు ఎలా ఉన్నా కృష్ణాజిల్లాలో రంగా పేరు ఇప్పటికీ ఒక పవర్ సెంటరే.
బలమైన కాపు సామాజికవర్గం నుండి వచ్చిన రంగాను కాపులు పూర్తిగా తన నాయకుడిగా అంగీకరించే సమయంలో హత్యకు గురయ్యారు. ఆయన తర్వాత ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ రాజకీయాల్లోకి వచ్చినా తండ్రి స్థాయిలో రాణించలేకపోతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఆయన పట్ల కావాలనే అలసత్వం చూపుతున్నాయి. దీనికి వంగవీటి అభిమానులు చెబుతున్న కారణమల్లా ఒక్కటే.. ఎంకరేజ్ చేస్తే తండ్రిలా ఎదిగిపోతాడని, అందుకే పరోక్షంగా తొక్కిపెడుతున్నారని. రాధా మనసులో కూడ ఇదే భావన ఉంది. ఏ టీడీపీ, వైసీపీ ఇలా ప్రధాన పార్టీల్లో మాట నెగ్గించుకోలేకపోవడంతో డీలా పడిపోయారు ఆయన. అసలు గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ దొరకలేదంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు.
మధ్యలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టగా అందులో చేరారు రాధ. కానీ పార్టీ కాంగ్రెస్ లో విలీనమవడంతో బయటుకొచ్చేశారు. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందే రాధా జనసేనలోకి వెళ్లాలని అనుకున్నారు. కానీ ఎందుకో ఆగారు. పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపినప్పటికీ ఉన్నపళంగా నిర్ణయం తీసుకోలేదు. తాజాగా రాధా జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ తో భేటీ అయ్యారు. ఈ చర్చ జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ దఫాలో రాధా జనసేనలో చేరిపోవడం ఖాయమని అంటున్నారు. ప్రధానంగా కాపు సామాజికవర్గం ఈ భేటీ మీద ఆసక్తిగా ఉంది. కాపు సామాజిక వర్గం నుండి ఇద్దరు బలమైన వ్యక్తులు ఒక్కటైతే బాగానే ఉంటుందని, పరస్పర సహకారంతో ముందుకెళితే మంచి ఫలితాలు రాబట్టుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు వంగవీటి క్రేజ్ ను ఏ పార్టీ కూడా పూర్తిస్దాయిలో ఎలివేట్ అయ్యే అవకాశం చేయలేదు. ఇప్పుడు పవన్ అయినా ఆ పని చేస్తే బాగుంటుందని చెబుతున్నారు.