వెనకటికొకడు ‘లేస్తే మనిషిని కాను’ అన్నాడట. ఒకసారి లేవమని అడిగితే లేవలేకపోయాడట. అలాగే ఉంది వంగవీటి రాధా కృష్ణమూర్తి వ్యవహారం. ఎన్నికల సమయంలో టిడిపి అభ్యర్ధి వెనకాల నిలబడే పరిస్ధితిని కొని తెచ్చుకున్నారు రాధా. ఎప్పుడు చూసినా తన తండ్రి వంగవీటి రంగా పేరు చెప్పుకోవటమే తప్ప సొంతంగా తానంటూ చేసిందేమీ లేదు. సరే కృష్ణా జిల్లా ప్రత్యేకించి విజయవాడలో వంగవీటి అనే పేరు ఓ బ్రాండ్ అయిపోయింది. రంగా వారసుడు కాబట్టి చెట్టుపేరు చెప్పి కాయలమ్మేసుకుంటున్నారు. అంతేకానీ నిజంగా తనకంటూ ఓ అస్తిత్వం కూడా లేని నేత రాధా.
ఇక ప్రస్తుతానికి వస్తే రాబోయే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టిడిపి తరపున బోండా ఉమా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే సీటు కోసం జగన్మోహన్ రెడ్డితో రాధా పేచి పెట్టుకున్నాడు వైసిపిలో ఉన్నపుడు. రాధాకు ఇక్కడ గెలిచే అవకాశం లేదని చెప్పి విజయవాడ తూర్పు గానీ మచిలీపట్నం ఎంపిగా కానీ పోటీ చేయమని జగన్ చెప్పారు. దాన్ని తిరస్కరించిన రాధా టిడిపిలోకి మారిపోయారు.
నిజానికి వైసిపిలో ఉన్నపుడు పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా యాక్టివ్ కాకపోయినా జగన్ తో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా రాధాకు బాగానే ప్రాధాన్యత దక్కేది. అయితే సమస్య ఎక్కడ వచ్చిందంటే ? తనను తాను రాధా ఎక్కువగా ఊహించేసుకున్నారు. మూడు ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక్కసారి గెలిచిన రాధా కూడా తనను తాను ఎక్కువగా ఊహించేసుకుంటే ఎలా ?
సరే వైసిపిలో ఉన్నంత కాలం రాధాను బాగా గోకేపిన టిడిపి నేతలు తీరా పార్టీలోకి వచ్చిన తర్వాత మాత్రం ఓ పక్కన పడేశారు. అందుకనే ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటున్న బోండా జీపులో ఆయన వెనకాల నిలబడి ప్రచారం చేస్తున్నారు. వైసిపిలో ఉండుంటే పోటీలో బిజిగా ఉండాల్సిన రాధా చివరకు టిడిపి అభ్యర్ధికి ప్రచారం చేస్తు జీపులో కనిపించేసరికి పాపం రాధా అనుకుంటున్నారు జనాలు.