ఇలా ప్లాన్ చేసి కొడతారని వల్లభనేని వంశీ ఊహించి ఉండడు పాపం 

Vallabhaneni Vamsi shocked with unexpected scene  

వైసీపీలో చెలరేగిన అసమ్మతి సెగల్లో మొదటగా వినిపించే పేరు వల్లభనేని వంశీ.  టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చిన ఆయన మూలంగా గన్నవరం వైసీపీలో మూడు వర్గాలు ఏర్పడ్డాయి.  అధికారంలో ఉన్నప్పుడు, ఎన్నికలకు ముందు వంశీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.  వైసీపీ నాయకులను ఒక ఆట ఆడేసుకున్నారు.  అనుకూల మీడియాను పిలిపించుకుని మరీ ప్రత్యర్థుల మీద సవాళ్ల దాడి చేశారు.  ఒకానొక దశలో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు బెదిరిపోయారు.  అలాంటి వంశీ ఎన్నికల తర్వాత పార్టీ మారి వచ్చి తమ పక్కనే కూర్చోవడాన్ని యార్లగడ్డ సహించలేకపోతున్నారు.  ఎమ్మెల్యే కావడంతో నియోజకవర్గంలో కూడ వంశీ హవానే నడుస్తోంది.  అధికారుల నుండి జిలా స్థాయి నేతల వరకు అందరూ వంశీకి సహకరిస్తున్నారు.  

Vallabhaneni Vamsi shocked with unexpected scene  
Vallabhaneni Vamsi shocked with unexpected scene

వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడ ఆయనకేనని అంటున్నారు.  దీంతో మరొక ముఖ్య నేత దుట్టా రామచంద్రరావు కూడ భగ్గుమన్నారు.  రాబీయే ఎన్నికల్లో వైసీపీ నుండి టికెట్ పొందాలని చూస్తున్నారు ఆయన.  అలాంటిది ఇప్పుడు వంశీ వచ్చి తన ఆశలు మీద నీళ్లు చల్లుతున్నాడని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని అంటున్నారు.  దీంతో గన్నవరం వైసీపీ మూడు ముక్కలైంది.  ఎదురుపడితే  కొట్లాటే అన్నట్టు ఉంది పరిస్థితి.  నేరుగా జగన్ కలుగజేసుకుని సర్దిచెప్పాలని చూసిన కుదరలేదు.  పై నుండి ఎలాగూ సహకారం లేదు కాబట్టి వంశీని నిలువరించడానికి ఆ ఇద్దరు నేతలు సొంత ప్రయత్నాలు చేసుకుంటున్నారు.  జనంలో ఆయనకు వ్యతిరేక వర్గాన్ని తయారుచేస్తున్నారు.  

ఈ నేపథ్యంలో వంశీకి ఎదురైన చేదు సంఘటన వెనుక వీరి హస్తం ఉందనే మాట వినిపిస్తోంది.  వంశీ బాపులపాడు మండలం మల్లవల్లిలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి కార్యక్రమం కోసం వెళ్లగా అక్కడి జనం వంశీని కార్యక్రమానికి రావొద్దని అడ్డుకున్నారు.  వాహనాలు అడ్డుపెట్టి ఎమ్మెల్యేని రోడ్డు మీదే నిలబెట్టేశారు.  చాలా తక్కువమందికి పట్టాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  చివరికి పోలీసు బందోబస్తుతో వంశీ కార్యక్రమానికి వెళ్లాల్సి వచ్చింది.  ఊహించని రీతిలో సొంత నియోజకవర్గంలోని జనమే ఎదురుతిరగడంతో వంశీ తట్టుకోలేకపోతున్నారు.  ఇన్నాళ్లు జనం బలం చూసుకునే వంశీ చెలరేగిపోయారు.  ఎవ్వరినీ  లెక్కచేయకుండా తోచింది, అనుకున్నది చేస్తూ పోయారు.  ఇప్పుడు ఆ బలం మీదే దెబ్బపడటంతో ఆయన అహం మీద దెబ్బపడ్డట్టయింది.  వ్యతిరేకత వెనుక యార్లగడ్డ, దుట్టాల హస్తం ఉందని గట్టిగా నమ్ముతున్నారట.  ఈ పరిణామంతో  గన్నవరం వర్గపోరు మరింత పెరిగేలా ఉంది. 

 

Keywords: Gannavaram TDP, Vallabhaneni Vamsi, Vallabhaneni Vamsi Mohan, YSRCP, Dutta Ramachandra Rao, Yarlagadda Venkata Rao, Gannavaram YSRCP, గన్నవరం, గన్నవరం ఎమ్మెల్యే, వైసీపీ, యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు , వల్లభనేని వంశీ, గన్నవరం వైసీపీ, వైఎస్ జగన్