టిఆర్ఎస్ ఎంపికీ గట్టి షాక్ ఇచ్చిన టిడిపి

 

అవిశ్వాస తీర్మానం గట్టెక్కుడో.. ఓడిపోవుడో దేవుడెరుగు కానీ.. రాజకీయాలు మాత్రం రసకందాయంలో పడ్డాయి. ఇప్పటివరకు టిడిపి, టిఆర్ఎస్ మధ్య సానుకూల వాతావరణం నెలకొన్న తరుణం ఉంది. కానీ ఈ అవిశ్వాసం పుణ్యమా అని ఆ రెండు పార్టీల మధ్య మళ్లీ ఘర్షణ వాతావరణం తప్పేలా లేదు. ఇంతకూ అసలు మ్యాటర్ ఏమంటే?

కేంద్రంపై టిడిపి అవిశ్వాసం పెట్టింది. ఈ అవిశ్వాసానికి అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలను కూడగట్టే పనిలో నిమగ్నమైంది టిడిపి. అయితే పక్క రాష్ట్రమైన తెలంగాణలోని అధికార టిఆర్ఎస్ పార్టీ మద్దతును ఇప్పటి వరకు టిడిపి కూడగట్టలేకపోయింది. అయితే ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర పార్టీల నుంచి మాత్రం మద్దతు కూడగట్టుకుంది.

ఇక టిఆర్ఎస్ ను ఇరకాటంలోకి నెట్టేందుకు టిడిపి ఈ అవిశ్వాసాన్ని వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తాజా పరిస్థితులు చూస్తే తెలుస్తోంది. టిడిపి నుంచి గెలిచి బంగారు తెలంగాణ నిర్మించేందుకు టిఆర్ఎస్ లో చేరిపోయారు మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి. కానీ ఇన్నిరోజులు ఆయన టిఆర్ఎస్ లో చేరినా పెద్దగా పట్టించుకోలేదు తెలుగుదేశం పార్టీ. చూసి చూడనట్లే వదిలేసింది. కానీ ఇప్పుడు మల్లారెడ్డి పీక పట్టుకున్నది టిడిపి. ఎందుకంటే అవిశ్వాసం సందర్భంగా ఓటు వేయాలంటూ అందరు టిడిపి ఎంపీలకు విప్ జారీ చేసినట్లే తమ పాత కాపు అయిన మల్లారెడ్డికి కూడా టిడిపి విప్ జారీ చేసింది. దీంతో మల్లారెడ్డి డైలమాలో పడ్డారు.

అయితే తాను అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేస్తానని మల్లారెడ్డి తమకు హామీ ఇచ్చినట్లు టిడిపి నేతలు చెబుతున్నారు. మరి మల్లారెడ్డి సభలో టెక్నికల్ గా టిడిపి సభ్యుడే కానీ.. ఆయన టిఆర్ఎస్ లో చేరిపోయారు. టిఆర్ఎస్ అవిశ్వాసానికి అనుకూలమా, వ్యతిరేకమా అన్నది ఇంకా తేల్చలేదు. ఈ పరిస్థితుల్లో మల్లారెడ్డి టిడిపి ఎంపీలతోపాటు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయకపోతే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ టిడిపి కోరే చాన్స్ ఉంది కూడా.

దీంతో ఈ పరిణామాలు మల్లారెడ్డినే కాదు టిఆర్ఎస్ ను కూడా ఇరకాటంలోకి నెట్టేశాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి దీనికి టిఆర్ఎస్ విరుగుడు మంత్రం ఎట్లా వేస్తుందన్నది చూడాలి.