ముందస్తు ఎన్నికలు సమీపిస్తున్న వేళ టిఆర్ఎస్ పార్టీకి అసమ్మతి సెగలు తీవ్రమవుతున్నాయి. జిల్లాల్లో అక్కడక్కడా ఇంతకాలం అసమ్మతి సెగలు తాకాయి. కానీ తొలిసారి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టిఆర్ఎస్ పార్టీకి తొలి షాక్ తగిలింది. కూకట్ పల్లి తాజా మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు గట్టి ఎదురు దెబ్బ తాకింది. కూకట్ పల్లి కార్పొరేటర్ కావ్యారెడ్డి ఏకంగా సొంత పార్టీ అభ్యర్థిపైనే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. పూర్తి వివరాలు చదవండి.
కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో మాధవరం కృష్ణారావు టిడిపి తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తర్వాత ఆయన బంగారు తెలంగాణ సాధించాలన్న ఉద్దేశంతో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆపరేషన్ ఆకర్షలో భాగంగా టిఆర్ఎస్ లో చాలా ముందుగానే ఆయన చేరిపోయారు. ఆయన తర్వాత చాలా మంది టిడిపి నేతలు బంగారు తెలంగాణ లక్ష్యం కోసం టిఆర్ఎస్ గూటికి చేరిపోయారు.
అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి పన్నాల కావ్యారెడ్డి గెలుపొందారు. ఆమె భర్త పన్నాల హరీష్ రెడ్డి కూడా రాజకీయాల్లో ఉన్నారు. అయితే పన్నాల హరీష్ రెడ్డి కూకట్ పల్లి టికెట్ రేసులో ఉన్నారు. కానీ ఆయనకు కాదని మాధవరం కృష్ణారావుకే టిఆర్ఎస్ ఈసారి అభ్యర్థిగా ప్రకటించింది.
ఈ నేపథ్యంలో పన్నాల హరీష్ రెడ్డి టిఆర్ఎస్ ప్రకటించిన జాబితాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు చివరి వరకు ఆయన కూకట్ పల్లి టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. కానీ ఫలించకపోవడంతో ఆయన టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఆయన కూకట్ పల్లి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక మాధవరం కృష్ణారావుకు టికెట్ కేటాయించినప్పటి నుంచి ఇటు మాధవరం వర్గానికి అటు కావ్యారెడ్డి వర్గానికి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈనేపథ్యంలోనే హరీష్ రెడ్డి పార్టీని వీడారు. కావ్యారెడ్డి మాత్రం ప్రస్తుతం టిఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. తాజాగా విశ్వసనీయ సమాచారం మేరకు కావ్యారెడ్డి టిఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు పై ఏకంగా ఎన్నికల కమిషన్ కే ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
టిఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు అనుకూలంగా కూకట్ పల్లిలోని డ్వాక్రా గ్రూప్ కమ్యూనిటీ ఆర్గనైజర్లు పనిచేస్తున్నారని ఆరోపిస్తూ కావ్యారెడ్డి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. డ్వాక్రా గ్రూపు కమ్యూనిటీ ఆర్గనైజర్స్ ను ప్రలోభాలకు గురిచేసి మాధవరం తనకు అనుకూలంగా పనిచేయించుకుంటున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెబుతున్నారు. ఈ ఘటన గ్రేటర్ రాజకీయాల్లో కలకలం రేపింది. ఇంతకాలం గ్రేటర్ హైదరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీలో మంచి సమన్వయం ఉందని భావిస్తున్న తరుణంలో ఈ ఘటన కొత్త చర్చకు దారి తీసింది.
అభ్యర్థుల ప్రకటన చేసినప్పటి నుంచి కార్పొరేటర్ కావ్యారెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు వర్గానికి మధ్య మాటల యుద్ధం సాగుతున్నది. మాధవరం దయతోనే కావ్యారెడ్డి కార్పొరేటర్ గా గెలిచారంటూ ఎమ్మెల్యే అభ్యర్థి మనుషులు విమర్శలు చేయడంతో కావ్యారెడ్డి ఇటీవల చాలా ఘాటుగా స్పందించారు. తాను ఎవరి దయా దాక్షిణ్యాల మీద గెలవలేదని, దమ్ముంటే కూకట్ పల్లిలో చర్చకు రావాలంటూ మాధవరం అనుచరులకు సవాల్ విసిరారు.
తనకు వ్యతిరేకంగా తన డివిజన్ లో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మాధవరం ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలోకి వచ్చారో తెలుసుకుని మాట్లాడితే మంచిదంటూ చురకలు వేశారు. తనను రాజీనామా చేయాలని కోరే అర్హత మాధవరం కు కానీ ఆయన మనుషులకు కానీ లేదన్నారు. ఒక మహిళా కార్పొరేటర్ అని కూడా చూడకుండా మాధవరం మనుషులు మాట్లాడుతున్న మాటలను పట్టించుకోవాల్సిన అవసరమే లేదన్నారు.
తాజాగా ఆమె ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంపై మాధవరం ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.