అరకు నియోజకవర్గం ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వర్ రావు హత్యతో టూరిస్టులు ఇరుక్కుపోయారు. ఆదివారం మధ్యాహ్నం అరకులో ఎంఎల్ఏ కిడారిని మావోయిస్టులు చుట్టుముట్టి హత్య చేసిన విషయం అందరికీ తెలిసిందే. గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎంఎల్ఏతో పాటు మాజీ ఎంఎల్ఏ సివేరి సోమను కూడా మావోయిస్టులు పట్టుకుని తుపాకులతో కాల్చి చంపేయటం పెద్ద సంచలనంగా మారింది.
ఎంఎల్ఏను మావోయిస్టులు కాల్చి చంపటం పక్కన పెడితే అదే ఘటనలో ఎటువంటి సంబంధం లేని వందలాది మంది పర్యాటకులకు అవస్తలు మొదలయ్యాయి. విశాఖపట్నం జిల్లాలోనే ఉన్న అరకు, పాడేరు ప్రాంతాలకు ఏపిలోనే కాకుండా ఒడిస్సా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుండి పర్యాటకులు పెద్ద ఎత్తున హాజరవుతుంటారు. శని, ఆదివారాల్లో వేలాదిమంది ఇక్కడకు వచ్చేస్తారు. మళ్ళీ ఆదివారం సాయంత్రం బయలుదేరి విశాఖపట్నం మీదుగా వాళ్ళ గమ్యస్ధానాలకు వెళ్ళిపోవటం పర్యాటకులకు మామూలే.
అదే విధంగా శనివారం తెల్లవారుజాముల అరకు, పాడేరుకు చేరుకున్న పర్యాటకులు ఆదివారం ఉదయం పై ప్రాంతాల నుండి బయలుదేరారు. సొంత వాహనాల్లున్న వారు, ఆర్టీసి, ప్రైవేటు వాహనాల్లో టూరిస్టుల తిరుగు ప్రయాణమయ్యారు. కొంతసేపైన తర్వాత వారు ప్రయాణిస్తున్న వాహనాలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. ముందు కారణం తెలీలేదు. తర్వాత తెలిసింది మావోయిస్టులు ఎంఎల్ఏ, మాజీ ఎంఎల్ఏని అరకులో కాల్చి చంపేశారని.
అరకు, పాడేరు టూరిస్టు డెస్టినేషన్ల నుండి బయలుదేరిన తర్వాత మధ్యలో పర్యాటకులకు ఈ విషయం తెలిసింది. అంటే అప్పటికే హత్యలు జరిగి గంటకు పైగా అయ్యింది. ఈలోగానే హత్యలు జరిగిన విషయం చుట్టుపక్కల ప్రాంతాలకు కార్చిచ్చు లాగ పాకిపోయింది. గిరిజన గ్రామాల్లోని స్ధానికులు ఎక్కడికక్కడ ఆందోళనలతో రోడ్లపైకి వచ్చేశారు. దాంతో వాహనాలు రోడ్లపైనే ఎక్కడివక్కడే ఆగిపోయాయి. అంటే ముందుకు వెళ్ళేందుకు లేదు వెనక్కు తిరిగేందుకు లేదన్న మాట. ఆలా ఎంతసేపు రోడ్లపైనే ఉండాలో తెలీక పర్యాటకుల్లో ఆందోళన మొదలైంది. పైగా మావోయిస్టులు పర్యాటకులపైకి కాల్పులు జరిపినా జరపచ్చనే భయం ఇంకోవైపు.
ఇక, అరకు, పాడేరుల్లో కాటేజీలను ఖాళీ చేసేసి బయలుదేరిన టూరిస్టులదీ ఇదే పరిస్ధితి. బుర్రా గుహలు తదితర ప్రాంతాల్లో ఉన్న పర్యాటకులు కూడా ఎక్కడికక్కడే ఇరుక్కుపోయారు. రాత్రంగా చాలామందికి తిండి, నిద్ర లేదు. మావోయిస్టుల కదలికల కోసం సాయంత్రం నుండి కూబింగ్ మొదలుపెట్టిన పోలీసులు కూడా తనిఖీల పేరుతో కనబడిన ప్రతీ వాహనాన్ని గంటల తరబడి నిలిపేస్తున్నారు.
సమస్య ఎక్కడ వచ్చిందంటే, మధ్యాహ్నం ఎంఎల్ఏ, మాజీ ఎంఎల్ఏల హత్యలు జరిగాయి. సాయంత్రం అరకు పోలీసు సర్కిల్ కార్యాలయాలను స్ధానికులు కాల్చేశారు. తర్వాత పోలీసుల గాలింపు చర్యలు మొదలయ్యాయి. ఆ తర్వాత పోలీసులు, మావోయిస్టులకు వ్యతిరేంగా ఏజెన్సీ ఏరియాలోని గిరిజనులు 48 గంటల బంద్ పిలుపిచ్చారు. ఒకదాని తర్వాత మరో సమస్య మీదపగటంతో పర్యాటకులు ఎక్కడివాళ్ళక్కడే ఇరుక్కుపోయారు.