తెలుగుదేశంపార్టీలో రెండు పెద్ద వికెట్లు పడిపోయాయి. దశాబ్దాల పార్టీ అనుబంధాన్ని తెంచుకున్నారు. టిడిపికి రాజీనామాలు ఇచ్చేసి బిజెపిలో చేరిపోయారు. దాంతో చంద్రబాబునాయుడుకు ఒక విధంగా షాక్ కొట్టినట్లైంది. వీరి మార్గంలోనే మరికొందరు నేతలు టిడిపికి రాజీనామా యోచనలో ఉన్నట్లు సమాచారం.
మొన్నటి వరకూ ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పని చేసిన ఈదర హరిబాబు టిడిపికి రాజీనామా చేశారు. పదవీ కాలం అయిపోయేవరకూ టిడిపిలోనే ఉన్న హరిబాబు పదవి నుండి దిగిపోగానే వెంటనే టిడిపికి రాజీనామా చేయటం గమనార్హం. ముందుగానే బిజెపి నేతలతో మాట్లాడుకున్న ఈదర కమలం కండువా కప్పేసుకున్నారు.
అలాగే గుంటూరు జిల్లాలో సీనియర్ నేత చందు సాంబశివరావు కూడా టిడిపికి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. ఈయన పార్టీలో దాదాపు మూడు దశాబ్దాలుగా ఉన్నారు. ఒకసారి ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. మొన్నటి ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుండి టికెట్ వస్తుందనుకున్నా రాలేదు. పైగా పార్టీ కూడా ఘోరంగా ఓడిపోవటంతో టిడిపి భవిష్యత్ మీద నమ్మకం లేకపోవటంతో రాజీనామాలు చేస్తున్నారు.
వీళ్ళందరూ వైసిపిలోనే చేరాలని అనుకున్నారు. కానీ ఇతర పార్టీల నుండి చేర్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం సిద్ధంగా లేరు. దాంతో వేరే ప్రత్యామ్నాయం లేక టిడిపి నుండి బయటకు వచ్చేయాలని అనుకున్న వారందరూ నేరుగా బిజెపిలోనే చేరుతున్నారు. తొందరలో ఇంకా చాలామంది టిడిపికి రాజీనామాలు చేసేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం.