ఈసారి పాటతో రిక్వస్ట్ చేస్తున్న టీడీపీ… బాబు కోసం బయటకు రండి!

టీడీపీ అధినేత చంద్రబాబును ఈ నెల 9వ తేదీ ఉదయం 6 గంటలకు ఆయన అనుమతితోనే ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను విజయవాడకు హెలీకాప్టర్ లో తీసుకురావాలని సీఐడీ భావించింది. అయితే… అందుకు అంగీకరించని చంద్రబాబు… రోడ్డు మార్గంలోనే తీసుకువెళ్లాలని కోరారు. దీంతో పోలీసులు బాబుని రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు తరలించారు.

అయితే ఈ సమయంలో బాబును అరెస్ట్ చేసి తీసుకొస్తున్న సమయంలో రోడ్లపై టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు హడావిడి చేస్తారని పలువురు భావించారు. బాబు కూడా ఆ ఉద్దేశ్యంతోనే హెలీకాప్టర్ వద్దని రోడ్డు మార్గంలో ప్రయాణించారని వైసీపీ నేతలు విమర్శలు చేశారు. అయితే… టీడీపీ నేతల నుంచి కానీ, కార్యకర్తల నుంచి కానీ ఊహించిన స్థాయిలో రెస్పాండ్ రాలేదు అనేది వాస్తవం.

అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును ప్రవేశపెట్టారు అధికారులు. సుమారు 10 గంటల పాటు జరిగిన వాదనల అనంతరం చంద్రబాబుకు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విదించారు న్యాయమూర్తి. అంతకు ముందు కనీసం జైలు సమీపంలో కూడా టీడీపీ జనాలు లేకపోవడంతో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కాంఫరెన్స్ ఏర్పాటుచేశారు!

ఈ సందర్భంగా విజయవాడ అర్బన్ ఎమ్మెల్యేలు అయినా స్పందించాలని కోరారు. బాబు అరెస్ట్ కు నిరసనగా జనసమీకరణ జరగాలని టీడీపీ నేతలను రిక్వస్ట్ చేసుకున్నారు. పైగా ఆ సమీకరించే జనాల్లో మహిళలు ఎక్కువ మంది ఉండేలా చూడాలని కోరుకున్నారు. అయినా కూడా ఆ సందడి, హడావిడీ ఎక్కడా కనిపించలేదనే మాటలు వినిపించాయి.

అయితే అరెస్ట్ అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన కొన్ని రోజుల తర్వాత అక్కడక్కడా టెంటులు వేయడం, నల్ల బాడ్జీలు ధరించిన కొంతమంది నిరసనలు చేయడం తెలిసిందే. అయితే అది ఆశించిన స్థాయి రియాక్షన్ కాదనే మాటలు వచ్చాయి. ఇదే సమయంలో ఎక్కడా అవాంచనీయ సంఘటనలు జరగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం వారికి అంత అవసరం లేకుండానే కేడర్ చల్లబడిందనే కామెంట్లు వినిపించాయి.

దీంతో పిలిస్తే రావడం లేదు, ప్రకటనలు ఇచ్చినా సరిగా పలకడం లేదు అని భావించారో ఏమో కానీ… ఈసారి పాటతో రివక్స్ట్ చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇందులో భాగంగా తాజాగా… ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్‌, సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు ఆధ్వర్యంలో ఒక పాటను సిద్ధం చేసి విడుదల చేశారు.

“తెలుగుజాతి వెలుగుబిడ్డ లేరా.. గడపదాటి తిరగబడగ రారా..” అనే ఫంక్తులతో ఉన్న ఈ పాటను తాజాగా అచ్చెన్నాయుడు విడుదల చేశారు. “ఒక్కరొస్తే బంధిస్తారు.. వందలొస్తే భయపెడతారు… వేలు, లక్షలుగా కదిలి, కోటి మంది తరలి వెళితే.. కూటకాల అడ్డుగోడలెంతరా…” అంటూ ఈ పాటతో పిలుపునిచ్చారు. దీంతో… ఇలా రెచ్చ గొట్టడం ఎందుకు.. వ్యవహారం సుప్రీం కోర్టుకు సైతం చేరిన అనంతరం ఇలాంటి పాటలెందుకు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.