ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు చక చకా మారిపోతున్నాయి. ఇందులో భాగంగా… తాజాగా మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం వ్యవహారం తెరపైకి వచ్చింది. పైగా పవన్ కల్యాణ్ రూపంలో ఏపీలో కాపు సామాజికవర్గ ఓట్లకు గండిపడుతుందని నమ్ముతున్న అధికారపార్టీ… ఈ మేరకు ముద్రగడను కీలకంగా మార్చబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఈయనతో వైసీపీ కీలక చర్చలు జరిపినట్లు సమాచారం.
కాపు ఉద్యమాలతో తెరపైకి వచ్చిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. గత టీడీపీ ప్రభుత్వంలో తుని రైలు దహనం ఘటనతో మరింతగా చర్చల్లోకి వచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఆయన్ను టార్గెట్ చేయడంతో విపక్ష వైసీపీని ఆశ్రయించి మద్దతు పొందారు. ఇది కాస్తా ఎన్నికల్లో సైతం వైసీపీకి అనుకూలంగా పనిచేసింది. ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మౌనంగా ఉంటున్న ముద్రగడ తాజాగా కీలక ప్రకటన చేశారు.
అవును… త్వరలో తన రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన చేస్తానని వెల్లడించిన ముద్రగడ పద్మనాభం ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఓసారి ఎంపీ మిధున్ రెడ్డితో చర్చలు జరిపిన ఆయన… తాజాగా కాకినాడ ఎంపీ వంగా గీతతో పాటు మరికొందరు వైసీపీ నేతలను ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు.
ఇందులో భాగంగా… వైసీపీ నుంచి ముద్రగడకు కాకినాడ ఎంపీ సీటును ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన కాదంటే ఆయన కుమారుడికి ఈ సీటు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పినట్లు సమాచారం. ఎంపీ సీటు వద్దంటే కుమారుడికి ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు కూడా సిద్ధమని వైసీపీ నేతలు ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ముద్రగడ తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారింది.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… ప్రధానంగా తనబలం గోదావరి జిల్లాల్లోనే అధికంగా ఉందని చెబుతూ, అక్కడి నుంచే వారాహియాత్రను సైతం ప్లాన్ చేసుకున్నారు పవన్ కల్యాణ్. దీంతో… ఈసారి వైసీపీకి కాపుల ఓట్లు అధికంగా తగ్గుతాయని తెలుస్తుంది! దీంతో… ముద్రగడ రూపంలో ఆ లోటును భర్తీ చేసుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదిపింది. కారణం… గోదావరి జిల్లాల్లోని కాపు సామాజికవర్గ ప్రజల్లో పవన్ తో పోలిస్తే ముద్రగడపైనే విశ్వసనీయత ఎక్కువ!!
దీంతో ఈ కొత్త స్టేప్ పవన్ కల్యాణ్ నమ్ముకున్న ఓట్లకు కచ్చితంగా గండికొట్టబోతుందని అంటున్నారు పరిశీలకులు. కారణం… సినిమా నటుడిగా పవన్ ను విపరీతంగా అభిమానిస్తారు కానీ, రాజకీయాలు, కులం సమస్యల విషయంలో ముద్రగడనే.. ఆ సామాజికవర్గ ప్రజలు నమ్ముతారు! ఇది కచ్చితంగా పవన్ కు బ్యాడ్ న్యుసే!