తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్యంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడనని ప్రమాణం చేసిన కేసీఆర్ ఇప్పుడు దానిని ఉల్లంఘిస్తున్నారన్నారు. ట్రాక్టర్లపై ప్రజా రవాణా నిషేదం ఉన్న విషయం తెలిసిందే, మరీ సీఎం కేసీఆర్ ప్రగతి నివేదన సభకు ఊరికో ట్రాక్టర్ పై రావాలని ప్రజలకెలా చెప్పారని ప్రశ్నించారు. ఖమ్మం నుంచి దాదాపు 2 వేల ట్రాక్టర్లు వస్తాయని తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్ కుమార్ లు చెబుతున్నారని చట్టాన్ని ఉల్లంఘించిన కేసీఆర్, తుమ్మల, పువ్వాడలపై అధికారులు కేసులు బుక్ చేయాలని లేని పక్షంలో కోర్టులు సుమోటోగా కేసులు బుక్ చెయ్యాలన్నారు.
టోల్ గేట్ కు రోజు వారీగా వచ్చే ఆదాయాన్ని చెల్లిస్తామని ప్రకటించారని, సభకు అదనంగా వచ్చే వాహనాలకు డబ్బులు ఎవరూ చెల్లిస్తారని రేవంత్ రెడ్డి టిఆర్ ఎస్ ను ప్రశ్నించారు. హెచ్ ఎండీఏ కమీషనర్ జనార్ధన్ రెడ్డి టిఆర్ ఎస్ కు వత్తాసు పలుకుతున్నారని, టోల్ గేట్ లో మినహాయింపు ఎలా ఇస్తారని విమర్శించారు.
కొంగర కలాన్ లో వేల చెట్లను నరికేస్తున్నారని హారిహారం పేరుతో చెట్లను నాటినట్టు ఫోటోలకు ఫోజులిచ్చిన టిఆర్ ఎస్ నేతలు, సినిమా నటులు ఇన్ని చెట్లు నరికినందుకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న కళాకారులను ఆడి పాడితే హాజరు వేస్తామని ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గమన్నారు. సర్కార్ ఉద్యోగులు పార్టీ సమావేశాలలో ఎలా ఆడిపాడతారని ఆయన నిలదీశారు.
ట్రాక్టర్ లో జనాలను తరలిస్తున్నవారిని, టోల్ గేట్ మినహాయింపులపై ఔటర్ రింగ్ రోడ్డుకు తూట్లు పొడుస్తున్న వారిపై, చెట్లు నరకడంపై, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న కళాకారులు టిఆర్ ఎస్ సభకు ఆడిపాడడంపై కోర్టు సుమోటోగా కేసులు పెట్టాలని రేవంత్ రెడ్డి అన్నారు.