ఏపీలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల హడావిడి నడుస్తోంది. పల్లె పోరులో ఆధిపత్యం కోసం పార్టీలు యత్నిస్తుంటే కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాల హడావిడి నడుస్తోంది. ఇదిలా ఉంటే ఏపీలోని పలు గ్రామాల్లో ఇవే చివరి పంచాయతీ ఎన్నికలుగా కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం పోలవరం ప్రాజెక్టు. అవును పోలవరం ప్రాజెక్టు కారణంగా వందకు పైగా గ్రామాల్లో ఇవే చివరి పంచాయతీ ఎన్నికలు కాబోతున్నాయి. ఇందుకు కారణం ఆ గ్రామాలన్ని పోలవరం ముంపు ప్రపాంతంలో ఉండటమే.
పోలవరం ప్రాజెక్టు కారణంగా ఉభయగోదావరి జిల్లాల్లోని 107 గ్రామాలు ముంపుకు గురికాబోతున్నాయి. ఆయా గ్రామాల్లో ఉండే నిర్వాసితులు పునరావాస కాలనీలకు తరలివెళ్లనునండటంతో అక్కడ వచ్చే విడత పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను ఈ ఏడాది మే నాటికి పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలోనే ఆదేశించారు.
సీఎం ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ అధికారులు కాఫర్ డ్యామ్ తో పాటు ఇతర ముఖ్యమైన పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. అలాగే భూ సేకరణ, పునరావాస కాలనీల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పోలవరం ప్రాజెక్టు పూర్తైతే 107 గ్రామాలను ఖాళీ చేయాల్సి వస్తుంది. ప్రాజెక్టు నీటిమట్టం 41.5 అడుగులకు చేరితే ఆ కాంటూరు పరిధిలోని అన్ని గ్రామాలను తరలిస్తారు. ఆయా గ్రామాల్లో మొత్తం 17, 904 కుటుంబాలు పునరావాస కాలనీలకు వెళ్లాస్సి ఉంటుంది. ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలంలో 44 గ్రామాలు, వర రామచంద్రాపురం మండలంలో 18 గ్రామాలు, కూనవరం మండలంలో ఒక గ్రామి కలిపి మొత్తం 63 గ్రామాలున్నాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 44 గ్రామాలు ముంపు ప్రాంతంలో ఉంటాయి