కొత్త చర్చ… షర్మిల విమర్శల వెనుక అసలు ఉద్దేశ్యం ఇదా?

వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటినుంచీ ఫుల్ దూకుడు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… టీడీపీని ఒకటి అంటే… వైసీపీ, బీజేపీలకు వంద అంటున్నారు! ప్రధానంగా ప్రత్యేక హోదా పేరు చెప్పి జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. హోదా తేలేదని జగన్ ని, హోదా ఇవ్వలేదని మోడీని దుయ్యబడుతున్నారు. ఈ సమయంలో పలు సందేహలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

వాస్తవానికి ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడం వెనుక తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగానే ఉంటుంది అన్ని పార్టీల వ్యవహారం. బీజేపీ ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదంటే.. విభజన హామీల్లో హోదాని కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేర్చలేదు అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. ఇక గడిచిన ఐదేళ్లుగా జగన్ ఏమి చేస్తున్నారు అని అంటే… హోదావద్దు ప్యాకేజీ ముద్దు అన్నవారి సంగతి ఏమిటి అని అన్నివేళ్లూ చంద్రబాబు వైపు చూపిస్తున్నాయి.

ఇదే సమయంలో నాడు పాచిపోయిన లడ్లు ఇచ్చారంటూ ఆవేశంగా మాట్లాడిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు మోడీ ముందు అత్యంత వినయంగా, భక్తి శ్రద్ధలతో ఉంటూ ఎందుకు వారితో అంటకాగుతున్నారని ఫైరవుతున్నారు. ఇలా చూస్తే… వైఎస్ జగన్ కంటే ఎక్కువగా… హోదా రాకపోవడానికి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ల పాత్ర ప్రధానంగా ఉందనేది స్పష్టమవుతుంది! జనసేన కాసేపు ఆటలో అరటిపండు అనుకుంటే… !

అయితే వైఎస్ షర్మిల మాత్రం ఈ విషయంలో జగన్ ని బీజేపీని మాత్రమే తప్పుపడుతుంది. దీంతో… షర్మిల విమర్శల వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటనే చర్చ మొదలైంది. ఇందులో భాగంగా… ఇటు వైసీపీని, అటు బీజేపీని దోషులను చేయడం వల్ల టీడీపీ + జనసేన కూటమితో కాంగ్రెస్ జతకట్టబోతుందని.. షర్మిలను కాంగ్రెస్ చీఫ్ గా ఎంపిక చేయడం వెనుక చంద్రబాబు తెరవెనుక నడిపిన కథ ఇదేనని అంటున్నారు పరిశీలకులు.

వాస్తవానికి ఇండియా కూటమిలో ఇప్పటికే కమ్యూనిస్టులు ఉన్నారు. తెలంగాణలో కలిసి పోటీచేశారు. ఇక ఏపీలో టీడీపీ జనసేన రెండూ పొత్తులో ఉన్నాయి. తమ పొత్తులోకి బీజేపీ కూడా రావాలని కోరుకుంటున్నాయని అంటున్నారు. అయితే ఏపీలో బీజేపీని పూర్తిగా బద్నాం చేసేపనికి పూనుకున్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. పైగా ఆమె బీజేపీని తూర్పారబడుతున్నా… ఆ పార్టీ నేతల నుంచి రియాక్షన్ రావడం లేదు!

కారణం… ఏపీ బీజేపీ తరుపున అధికారికంగా పురందేశ్వరి రియాక్ట్ అవ్వాలి.. దానికి కాస్త క్రెడిబిలిటీ ఉంటుంది! అయితే… ఏపీలో బీజేపీపై షర్మిల దూకుడు ప్రదర్శిస్తున్నా… కడిగి పారేస్తున్నా… పురందేశ్వరి మాత్రం గమ్మునున్నారు. దీంతో… ఇదంతా బాబు & కో వేసిన స్కెచ్ లో భాగమని, అందుకే షర్మిల విమర్శలపై ఏపీ బీజేపీ చీఫ్ స్పందించ కుండా సైడ్ అయిపోయారని అంటున్నారు. దీంతో… ఎన్నికల నాటికి అసలు పొత్తులో ఉన్నవారంతా ఒక చోటకి చేరిపోతారని అంటున్నారు పరిశీలకులు.