Operation Kagar: చంద్రబాబుపై దాడికి కారణమైన ప్రధాన సూత్రధారి మృతి

దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ చివరకు చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ వ్యక్తి, ఇంజినీరింగ్ చదివిన తర్వాత నేరుగా నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్లిపోయి, దేశ వ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల్లో ప్రధాన బాధ్యతలు తీసుకున్నాడు. 2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుపతి అలిపిరిలో జరిగిన క్లెమోర్ మైన్ దాడికి ఇతడే ప్రధాన సూత్రధారి అన్నది పోలీసుల అభిప్రాయం.

నంబాల దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టు ఉద్యమాన్ని బలంగా నిర్మించడంలో కీలకమైన నేతగా గుర్తింపు పొందాడు. కేంద్ర కమిటీ సభ్యుడిగా, కార్యదర్శిగా పనిచేస్తూ పలు వ్యూహాత్మక హత్యలకు ప్రణాళికలు సిద్ధం చేశాడని సమాచారం. ముఖ్యంగా ఆంధ్రాలో బలిమెల ఘటన, కిడారి సర్వేశ్వరరావు హత్య వంటి ఘటనలకు ఇతని ప్రమేయం ఉందని విచారణల్లో తేలినట్లు తెలుస్తోంది.

చివరికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “ఆపరేషన్ కగార్”లో భాగంగా చత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో నంబాల కేశవరావు సహా మొత్తం 26మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇది మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పోలీసులు వెతుకుతున్న నంబాలపై రూ.1.5 కోట్లు రివార్డు ఉండటం గమనార్హం. ఈ ఘటనతోపాటు చంద్రబాబు తదితర రాజకీయ నేతలపై జరిగిన దాడుల వెనుక ఎవరు ఉన్నారో మరింత స్పష్టత వచ్చింది.