తెలంగాణ నిరుద్యోగులకు “పరీక్ష”

తెలంగాణలో ప్రభుత్వోద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్ధులకు కలగ పులగంగా ఉన్న పరీక్షల షెడ్యూళ్లు పరీక్ష పెడుతున్నాయి. ఒకే సమయంలో పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల షెడ్యూళ్లు రూపొందించడంతో ఆందోళన నెలకొంది. ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన వారికి ఈ పరీక్షల తేదిలు గుబులు పుట్టిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వ పరీక్షలు ఉన్న రోజు పరీక్షల షెడ్యూళ్లు లేకుండా టిఎస్ పీఎస్సీ ప్రకటించే అవకాశం ఉన్నా కనీస అవగాహన లేకుండా పరీక్షల తేదిలు ప్రకటించారని, దాంతో తాము ఏదో ఒక పరీక్ష మాత్రమే రాసే అవకాశం ఉందని ఇప్పటికైనా పరీక్ష తేదిలలో మార్పులు చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

టిఎస్ పీఎస్సీ జూన్ 2న గ్రూప్ 4 ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటన సమయంలోనే పరీక్ష తేదిని అక్టోబర్ 7 గా ప్రకటించింది. ఈ పోస్టుకు 5 లక్షల మంది పోటిలో ఉన్నారు. కానీ అక్టోబర్ 6న గురుకుల నియామక బోర్డు టిజిటి, పీజీటీ పోస్టులకు పేపర్ 1 పరీక్ష నిర్వహిస్తోంది.  దీంతో గ్రూప్ 4 కు ప్రిపేర్ అయ్యేందుకు దాదాపు 1.5 లక్షల మందికి ఇబ్బందికరంగా మారింది.  గ్రూప్ 4 కి హజరయితే అక్టోబర్ 8న జరిగే టిజిటి పరీక్షకు హాజరు కావడం కష్టమే. అక్టోబర్ 7న ఐబీపీఎస్ ఆర్ ఆర్ బీ ఆఫీసు అసిస్టెంట్ రాత పరీక్ష ఉంది.

తెలంగాణ ప్రభుత్వం దాదాపు 16,925 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 30 న పరీక్ష నిర్వహిస్తోంది. దాదాపు 5 లక్షల మంది పరీక్ష రాస్తున్నారు. ఈ నెల 30 నే ట్రాన్స్ కో జూనియర్ అకౌంటెంట్స్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహిస్తున్నారు.

అక్టోబర్ 14 న ట్రాన్స్ కోలో జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులకు పరీక్ష ఉంటుందని ఆ సంస్థ పేర్కోంది. అదే సమయంలో గురుకుల టిజిటీ పరీక్షలు ఉన్నాయి. ఈ రెండింటికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఏదో ఒక పరీక్ష వదిలి పెట్టాల్సి ఉంటది.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 7 వేల గ్రూప్ డి పోస్టులకు 15 లక్షల మంది నిరుద్యోగులు పోటి పడుతున్నారు.  ఈ నెల 17 నుంచి దాదాపు 44 రోజుల పాటు పరీక్షలు జరుగుతున్నాయి. రోజుకి మూడు షిఫ్టుల చొప్పున 45 వేల మంది అభ్యర్ధులు హాజరు కానున్నారు. ఈ సమయంలోనే తెలంగాణ పోలీసు కానిస్టేబుల్స్, గురుకుల టీచర్లు, ట్రాన్స్ కో జేఏవో , జేపీవో , గ్రామీణ బ్యాంకుల పీవో పరీక్షలూ ఉండటంతో నిరుద్యోగులు కొన్ని అవకాశాలను కోల్సోవాల్సి వస్తోంది.

జూనియర్ పంచాయతీ కార్యదర్శి పరీక్షను వాయిదాల మీద వాయిదా వేస్తూ అక్టోబర్ 10 న నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అదే తేదిన గ్రూప్ డి పరీక్షలు ఉండటంతో చాలా మంది ఈ పరీక్షను రాసే అవకాశం లేదు. పరీక్ష తేదిని వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పరీక్షల షెడ్యూళ్లు మారే అవకాశం లేకపోవడంతో టిఎస్ పీఎస్సీ,గురుకుల బోర్డు, పంచాయతీ డిపార్టుమెంట్ లు స్పందించి పరీక్షల తేదిలను మార్చాలని నిరుద్యోగులు కోరుతున్నారు. సేమ్ రోజు రెండు పరీక్షలు ఉండటంతో తాము ఏదో ఒక పరీక్షను కోల్పోవాల్సి వస్తుందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.