Tesla: ఏపీలో టెస్లా ప్లాంట్.. అయ్యే పనేనా?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టెస్లా ప్లాంట్‌ను రాష్ట్రానికి ఆకర్షించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. మౌలిక వసతులు, సౌకర్యాలు, వాణిజ్య అనుకూలతలతో పాటు పొర్టు అనుసంధానం ఉన్న ప్రాంతాలను టెస్లా పరిశీలిస్తోందని సమాచారం. ఏపీ సుదీర్ఘ తీర ప్రాంతం, కియా మాదిరి విజయవంతమైన ఆటోమొబైల్ ప్లాంట్లకు హబ్ కావడమే ఈ ప్రయత్నంలో బలమైన అంశంగా నిలుస్తోంది. ముఖ్యంగా కియా ప్లాంట్ ఏర్పాటులో చంద్రబాబు తీసుకున్న చర్యలు ఇప్పుడు టెస్లా ప్రాజెక్టు చర్చల్లో కీలకంగా మారాయి.

టెస్లా ఇండియాలో అడుగు పెట్టే క్రమంలో ఆ సంస్థకు అనువైన స్థలం, మౌలిక వసతుల కల్పనకు ఏపీ ముందంజలో ఉంది. ఇందుకోసం ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (EDB) టెస్లా ప్రతినిధులతో చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టెస్లా ముందుగా తన కార్లను దిగుమతి చేసి నిల్వ చేసుకునే ప్రాంతంగా ఏపీని ఎంచుకునే అవకాశం ఉంది. ఇటీవలే చంద్రబాబు, లోకేశ్‌లు అమెరికా పర్యటనలో టెస్లా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో భేటీ అయ్యి, ఏపీలో పెట్టుబడుల అవకాశాలను వివరించినట్లు సమాచారం.

టెస్లా సీఎఫ్‌వో వైభవ్ తనేజాతో లోకేశ్ చర్చలు సానుకూలంగా ముగిసినట్లు తెలుస్తోంది. ఏపీలో కియా ప్లాంట్ ఎలా విజయవంతమైందో అదే విధంగా టెస్లా ప్లాంట్ కూడా విజయవంతం అవుతుందని బాబు వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక, టెస్లా కోసం ప్రత్యేక పారిశ్రామిక జోన్ ఏర్పాటు చేసే యోచన కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉన్నట్లు సమాచారం.

ఏపీలో పరిశ్రమలు ఏర్పడితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. టెస్లా ప్రాజెక్టు సాకారమైతే ఏపీని ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ తయారీ కేంద్రంగా మార్చే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. చివరికి, టెస్లా ఏపీ వైపే మొగ్గు చూపుతుందా లేదా, ఇతర రాష్ట్రాలకే ఈ బంపర్ ఆఫర్ దక్కుతుందా? అనేది ఆసక్తిగా మారింది.

రేవంత్ రెడ్డి నోటా జగన్ || CM Revanth reddy Shocking Comments On Ys Jagan || KCR || Telugu Rajyam