ఆ రెండు కుటుంబాల్లో టెన్షన్

అవును నారా, నందమూరి కుటుంబాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే నారా కుటుంబం నుండి ఇద్దరు పోటీ చేశారు. అలాగే నందమూరి కుటుంబంలో నందమూరి బాలకృష్ణ తో పాటు బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ కూడా పోటీ చేశారు. అంటే మొత్తం నలుగురు పోటీలో ఉండగా గెలుపు ఎవరిని వరిస్తుందనే విషయంలోనే టెన్షన్ పెరిగిపోతోంది.

కుప్పంలో నారా చంద్రబాబునాయుడు గెలుపుపై ఎవరికీ అనుమానాల్లేవు. కాకపోతే పోయిన ఎన్నికల్లో వచ్చిన 46 వేల మెజారిటీ వస్తుందా ? రాదా ? అన్నదే అనుమానం. ఇక నారావారి సుపుత్రుడు, బాలయ్య పెద్దల్లుడు నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేశారు. లోకేష్ గెలుపు మామూలుగా అయితే సాధ్యంకాదు. ఎందుకంటే సిట్టింగ్ ఎంఎల్ఏ వైసిపి అభ్యర్ధి ఆళ్ళ రామకృష్ణారెడ్డి చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్. కాబట్టి ఇక్కడ లోకేష్ గెలుపు అంత ఈజీ కాదు. అందుకే టెన్షన్ పడుతున్నారు.

అదే సమయంలో అనంతపురం జిల్లాలోని హిందుపురం అసెంబ్లీకి బాలయ్య పోటీ చేస్తున్నారు.  హిందుపురం మామూలుగా అయితే టిడిపికి కంచుకోటనే చెప్పాలి. ఎలాగంటే 1983లో ఎన్టీయార్ పార్టీ పెట్టినప్పటి నుండి ఇక్కడ టిడిపి ఓడిందేలేదు. అలాంటి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంఎల్ఏగా బాలయ్య బాగా వ్యతిరేకత పెంచుకున్నారు. ఎక్కడపడితే  అక్కడ జనాలు బాలయ్యపై మండిపోతున్నారు. ఈ నేపధ్యంలో బాలయ్య గెలుపు  సస్పెన్స్ గా మారింది.

చివరగా విశాఖపట్నం లోక్ సభలో బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ పోటీ చేశారు. మొదటి నుండి భరత్ పోటీ విషయంలో అనేక మలుపులు తిరిగి చివరకు పోటీలో నిలబడ్డారు. కాబట్టి గెలుపు అవకాశాలు కూడా తక్కువనే చెప్పాలి. అయితే తాను కచ్చితంగా గెలుస్తానని భరత్ మంచి విశ్వాసంతో చెబుతున్నారు. కాబట్టి పై నలుగురు పోటీలో చంద్రబాబు విజయం ఖాయం అయితే మిగిలిన ముగ్గురి విషయంలోనే టెన్షన్ పెరిగిపోతోంది.