ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబునాయుడులో టెన్షన్ పెరిగిపోతోంది. ఏరోజు ఏ ఎంఎల్ఏ లేకపోతే ఏ ఎంపి టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరుతారో అన్న టెన్షన్ తట్టుకోలేకపోతున్నారట. ప్రకాశం జిల్లా టిడిపి నేతలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబులో మాగుంట టెన్షన్ స్పష్టంగా కనిపించింది. ఎంఎల్సీ అయిన మాగుంట టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరుతారనే ప్రచారం బాగా జరుగుతోంది. దానికి తగ్గట్లే మాగుంట కూడా రాజీనామా విషయమై పెదవి విప్పలేదు.
విషయం తెలుసుకునేందుకు మాగుంటను చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడుతున్నారు. అయినా ప్రచారం మాత్రం ఆగకపోగా మరింత పెరిగింది. దాంతో మాగుంట టిడిపిలో ఎక్కువ కాలం ఉండరన్న విషయం టిడిపి నేతలకు అర్ధమైపోయింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మాగుంట మనిషిగా మాత్రమే టిడిపిలో ఉన్నారట. ఆయన మనసంతా వైసిపిలోనే తిరుగుతోందట. అందుకు కారణం ఏమిటంటే, రాబోయే ఎన్నికల్లో టిడిపి గెలవదని కచ్చితమైన సమాచారం ఉండటమే అని తెలుస్తోంది.
దాంతో ఎటూ ఓడిపోయే పార్టీ తరపున ఎంపిగా పోటీ చేసి కోట్ల రూపాయలను ఎందుకు వృధాగా ఖర్చు చేయటమని మాగుంట భావనట. పార్టీ మార్పుపై మీడియా అడిగినపుడు ఈనెల 28వ తేదీన మాట్లాడుతానంటూ మాగుంట చెప్పటంతో చంద్రబాబు అండ్ కో లో ఆందోళన పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే చంద్రబాబుతో మాగుంటతో పాటు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎంఎల్ఏలు, నేతలు హాజరయ్యారు.
సమీక్షకు ముందుగా జిల్లా మంత్రి, ఇన్చార్జి మంత్రి నారాయణ, శిద్ధా రాఘవరావు మాగుంటతో సమావేశమయ్యారు. తర్వాత ఎంఎల్ఏలు మాట్లాడారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా చాలాసేపు మాగుంటతో భేటీ జరిపారు. అంటే మాగుంటతో ఎవరికి వారుగా విడి విడిగా మాట్లాడుతున్నారంటేనే ప్రకాశం జిల్లాలో మాగుంట వ్యవహారం ఏ స్ధాయిలో టెన్షన్ పుట్టిస్తోందో అర్ధమైపోతోంది. ఇంత చేసి మాగుంట టిడిపిలోనే ఉంటారా అంటే ఎవరికీ క్లారిటీ రాలేదట. మరి 28వ తేదీన ఏం చెబుతారో చూడాల్సిందే.