చంద్రబాబులో పెరిగిపోతున్న టెన్షన్

నేతల దెబ్బకు  చంద్రబాబునాయుడులో టెన్షన్ పెరిగిపోతోంది.  మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి రాజీనామా చేసి వెళిపోతున్నారు. ఈ నేపధ్యంలోనే  ఈనెల 14వ తేదీన  చంద్రబాబు హయాంలో  విస్తృతస్ధాయి సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి ఎంఎల్ఏలతో పాటు ఓడిపోయిన అభ్యర్ధులు, నేతలు, క్యాడర్ కూడా పాల్గొంటున్నారు.

మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం లేక ఇప్పటికే కొందరు కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసేశారు. కడపలో వీరశివారెడ్డి, విజయవాడలో దేవినేని అవినాష్, అనంతపురంలో వరదాపురం సూరి,  కర్నూలులో భూమా మహేష్ రెడ్డి, భూమా కిషోర్ రెడ్డి, గుంటూరులో చందు సాంబశివరావు, ప్రకాశం జిల్లాలో ఈదరి హరిబాబు లాంటి నేతలు టిడిపిని వదిలేసి బిజెపిలో చేరారు. ఇంకా చాలామంది నేతలు పార్టీని వదిలేయటానికి రెడీగా ఉన్నారు.

ప్రధాన సమస్య ఏమిటంటే టిడిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏల్లో 16 మంది టిడిపిలో నుండి తమ పార్టీలోకి  జంప్ చేయటానికి రెడీగా ఉన్నట్లు బిజెపి నేతలు పదే పదే చెబుతున్నారు. ఇందులో ఎంతనిజమో తెలీదు కానీ బిజెపిలోకి వెళ్ళటానికి కొంతమంది ఎంఎల్ఏలైతే రెడీగానే ఉన్నట్లు తెలుస్తోంది. గంటా శ్రీనివాస్, అనగాని సత్యప్రసాద్ లాంటి ఎంఎల్ఏ ఇప్పటికే బిజెపి ఢిల్లీ నాయత్వంతో టచ్ లో ఉన్నట్లు సమాచారం.

ఇక విజయవాడ ఎంపి కేశినేని నాని అయితే చంద్రబాబుకే డైరెక్టుగా వార్నింగులు ఇచ్చిన విషయం అందరూ  చూసిందే.  పార్టీలోని కాపు నేతలు చంద్రబాబుతో సంబంధం లేకుండానే  ప్రత్యేక సమావేశాలు పెట్టుకుంటున్నారు. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో చాలామంది ఎంఎల్ఏలు చంద్రబాబుకు మద్దతుగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఇవన్నీ చూస్తుంటే పార్టీ నుండి  ఏరోజు ఏ నేత వెళిపోతారో అర్ధంకాక క్యాడర్ మొత్తం అయోమయంలో ఉంది. అందుకనే తొందరలో జరగబోయే విస్తృతస్ధాయి సమావేశం అంటేనే అందరిలో టెన్షన్ పెరిగిపోతోంది.