చంద్రబాబునాయుడు పట్టుబడుతున్నట్లు 14వ తేదీ క్యాబినెట్ సమావేశం జరుగుతుందా ? జరగదా ? అనే విషయంలో టెన్షన్ పెరిగిపోతోంది. పంతానికి పోయి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నపుడు క్యాబినెట్ సమావేశం పెట్టాలని చంద్రబాబు నిర్ణయించటం తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలిసిందే. క్యాబినెట్ జరగాలంటే కేంద్ర ఎన్నికల కమీషన్ అనుమతించాలి. అంటే ఇపుడు బంతి కేంద్ర ఎన్నికల కమీషన్ కోర్టులో ఉంది.
కారణాలేవైనా చంద్రబాబుకు ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం మధ్య పరిస్ధితులు ఉప్పు నిప్పులాగ తయారయ్యాయి. అందుకు ప్రధాన కారణం చంద్రబాబే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనవసరంగా ఎల్వీపై చంద్రబాబు నోరుపారేసుకున్న ఫలితంగా ఏ రాష్ట్రంలోను లేనట్లుగా సిఎం-సిఎస్ మధ్య వివాదాలు తీవ్రస్ధాయిలో జరుగుతోంది.
ఈ నేపధ్యంలోనే ఎల్వీ మరికొద్దిసేపట్లు చంద్రబాబును కలవబోతున్నారు. చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఎల్వీ మర్యాద పూర్వకంగా చంద్రబాబును కలిశారు. అప్పుడు చంద్రబాబు తన వ్యతిరేకతను ఎల్వీ మొహం మీదే చెప్పేశారు. దాంతో మళ్ళీ చంద్రబాబును ఇంతవరకూ ఎల్వీ కలవలేదు. ఈరోజు సాయంత్రంలోగా కేంద్ర ఎన్నికల కమీషన్ నుండి అనుమతి వస్తేనే క్యాబినెట్ సమావేశం జరుగుతుందట. లేకపోతే అంతే సంగతులు.
ఈ నేపధ్యంలో చంద్రబాబును కలవాల్సిన అవసరం ఎల్వీకేమొచ్చింది ? ఇదే అందిరినీ ఉత్కంఠకు గురిచేస్తోంది. బహుశా క్యాబినెట్ సమావేశం నిర్వహించే విషయమై కేంద్ర ఎన్నికల కమీషన్ నుండి తాజా సమాచారం ఏదైనా ఎల్వీకి అందుంటుందా ? అన్న విషయంపైనే అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది. ఆ విషయాన్నే నేరుగా చంద్రబాబును కలిసి బ్రీఫింగ్ చేయనున్నారా ? అన్న ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. ఏం జరిగిందో తెలియాలంటే కొద్దిసేపు వెయిట్ చేయాల్సిందే.