అందుబాటులో తెలంగాణ కానిస్టేబుల్ పరీక్ష హాల్ టికెట్స్

తెలంగాణలో సెప్టెంబర్ 30 న నిర్వహించనున్న పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాతపరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు హాల్ టిక్కెట్లను సెప్టెంబర్ 20 గురువారం ఉదయం 8 గంటల నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి చైర్మ న్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. హాల్ టిక్కెట్లను 28వ తేది అర్ధరాత్రి   12 గంటల వరకు వరకు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

సెప్టెంబర్ 30న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్ష ఉంటుందని హాల్ టిక్కెట్లను www.tslprb.in నుంచి హాల్ టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. ఏ4 సైజు పేపర్ లో రెండు వైపులా వచ్చేలా హాల్ టిక్కెట్లను బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ ఔట్ తీసుకోవాలన్నారు. హాల్ టిక్కెట్ పై అభ్యర్ధి పాస్ పోర్టు సైజు ఫోటోను అతికించాలని సూచించారు. ఫోటోను అతికించకుండా హాల్ టిక్కెట్ తో వచ్చే అభ్యర్ధులను పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేశారు. హాల్ టికెట్ లో ఉన్న నిబంధనలను అనుసరించి అభ్యర్ధులు పరీక్షకు హాజరు కావాలని ఆయన తెలిపారు. హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌లో ఏమైనా సమస్యలు తలెత్తితే support@tslprb.inకు ఈ-మెయిల్‌ పంపొచ్చని, 9393711110, 9391005006 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చని పేర్కొన్నారు. ఆలస్యం చేయకుండా ముందుగానే హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవాలని చివరి వరకు ఉంటే సర్వర్ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నారు. హాల్ టికెట్స్ లో ఏమైనా తప్పులుంటే వాటిని తెలియజేసి సరిచేసుకోవాలని సూచించారు. 

అభ్యర్ధులు పరీక్ష కేంద్రాలను ముందు రోజే పోయి చూసుకోవాలని అలా అయితే ఎటువంటి ఇబ్బందులు రావన్నారు. దూర ప్రాంతాల వారు కాస్త ముందుగానే బయలు దేరి సకాలంలో సెంటర్లకు చేరుకోవాలన్నారు. రవాణా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. పరీక్షకు గంట ముందుగానే సెంటర్ కు చేరుకోవాలన్నారు. 

నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమన్నారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. ప్రతి అభ్యర్ధి హాజరును బయోమెట్రిక్ విధానంలో తీసుకుంటామని తెలిపారు. ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లీషు,ఉర్దూ భాషల్లో ఉంటుందని చెప్పారు. ఎటువంటి మాస్ కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా పకడ్బందిగా పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయని తెలిపారు. పరీక్షలో మాస్ కాపీయింగ్, అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.