తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి ఓ వైపు వివాదం నడుస్తుండగానే ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్దమైతుంది. మరో వారం రోజుల్లోనే తెలంగాణ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఒక్కో విడత ఎన్నికల నిర్వహణకు 18 రోజుల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ప్రకటించనుంది.
తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ను అనుసరించి షెడ్యూల్ జారీ కానుంది. నూతన పంచాయతీ రాజ్ చట్టం ఏర్పడిన తర్వాత నూతన నిబంధనలతో జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఈ విధంగా జరగనున్నాయి.
-
ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత 4 వ రోజు నుంచి 10వ రోజు వరకు నామినేషన్ల స్వీకరణ. చివరి రోజు సెలవు ఉన్నా నామినేషన్లు స్వీకరిస్తారు.
-
నామినేషన్ల స్వీకరణ ముగిసిన తర్వాత తెల్లారే వాటిని పరిశీలించనున్నారు.
-
నామినేషన్ల పరిశీలన ముగిసిన తెల్లారి నామినేషన్ల స్వీకరణ అప్పీళ్లను స్వీకరించి మరుసటి రోజు వాటిని పరిశీలిస్తారు.
-
నామినేషన్లు పరిశీలన ముగిసిన నాటి నుంచి మూడో రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు.
-
ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే బరిలో ఉన్న సర్పంచ్, వార్డు మెంబర్ల తుది జాబితా ప్రకటన.
-
నామినేషన్ల గడువు ముగిసిన 5 వ రోజు పోలింగ్ నిర్వహణ, బ్యాలెట్ విధానంలో నే ఎన్నిక. పార్టీ గుర్తులు కాకుండా సాధారణ గుర్తులే అభ్యర్దులకు కేటాయింపు
-
పోలింగ్ ను ఉదయం 7 గంటల నుంచి మద్యాహ్నం 1 గంటల వరకు నిర్వహిస్తారు.
-
పోలింగ్ జరిగిన రోజే మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాల ప్రకటన
-
ఎన్నికైన అభ్యర్దుల వివరాలు అధికారిక ప్రకటన
-
వెంటనే ఉప సర్పంచ్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికైన సర్పంచ్, వార్డు మెంబర్ల సమక్షంలో ఉప సర్పంచ్ ఎన్నిక. ఉప సర్పంచ్ ఎన్నికకు సగం మంది వార్డు మెంబర్లు హజరవుతేనే ఎన్నిక జరుగుతుంది. లేనిచో తెల్లారి ఎన్నిక నిర్వహణ.
ఈ విధంగా తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం, ఎన్నికల సంఘం సిద్దమైతుంది. కానీ రిజర్వేషన్ల గొడవ కోర్టులో నడుస్తుండడంతో ఏమవుతుందో అనే చర్చ జరుగుతోంది.