తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలివే

తెలంగాణ గ్రామపంచాయతీ తొలి విడత ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. 4,479 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలకు నోటీసులు ఇవ్వగా, 9 పంచాయతీల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. 769 పంచాయతీల్లో ఒక్క అభ్యర్థి మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో అవి ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,701 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 85.76 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అధికార టీఆర్ఎస్ మద్దతుదారులు ఏకగ్రీవాలతో కలిపి 2,629 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. దాదాపు 59 శాతం సర్పంచ్ పదవులు టీఆర్ఎస్ గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకుంటూ 920 పంచాయతీలను  దక్కించుకుంది. సుమారు 20 శాతం పంచాయతీలు కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లాయి. ఇక బీజేపీ మద్దతుదారులు 67 చోట్ల, సీపీఎం 32, తెలుగుదేశం 31, సీపీఐ మద్దతుదారులు 19 చోట్ల గెలిచారు. ఇతరులు 758 పంచాయతీలను దక్కించుకున్నారు. పలు కారణాల వల్ల 14 పంచాయతీల ఫలితాలు ఆగిపోయాయి.