చెయ్యి గుర్తుకే ఓటేయాలన్న తెలంగాణ మంత్రి (వీడియో)

ఆయన బంగారు తెలంగాణ సాధన కోసం టిఆర్ఎస్ తో కలిసొచ్చిన నాయకుడు. ఆయన దేవాదాయ, హౌసింగ్ శాఖకు మంత్రి. పేరు అలోల్ల ఇంద్రకరణ్ రెడ్డి. ఆయన తాజాగా నిర్మల్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ తరుపున బరిలో ఉన్నారు. ప్రచారం కూడా జోరుగా చేస్తున్నారు. కాకపోతే ఆయన ప్రచారం గతి తప్పింది. ఆ వివరాలేంటో చదవండి… కింద వీడియో ఉంది. 

అలోల్ల ఇంద్రకరణ్ రెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. ఆయన తెలంగాణవాది. మలిదశ తెలంగాణ ఉద్యమ నేత. రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఆయన బిఎస్పీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయనతోపాటు సిర్పూర్ నియోజకవర్గంలో కోనేరు కోనప్ప కూడా బిఎస్పీ నుంచి గెలిచారు. వీరిద్దరినీ బంగారు తెలంగాణ కోసం కేసిఆర్ పార్టీలోకి తీసుకున్నారు. బిఎస్పీని టిఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేశారు. తర్వాత ఐకె రెడ్డికి మంత్రి పదవి వచ్చింది.

ఇదంతా గతం.. ఇక అసలు ముచ్చటేమంటే? ఐకె రెడ్డి తన ప్రచారంలో భాగంగా ఒక గ్రామంలో రోడ్ షో జరిపారు. ఆ రోడ్ షో లో తన ప్రసంగం అయిపోయిన తర్వాత చెయ్యి గుర్తుకే మన ఓటు అని నినాదాలు చేశారు. ఆయన చెయ్యి గుర్తు కే అనగానే జనాలు మన ఓటు అని ప్రతి నినాదం చేశారు. అలా రెండుసార్లు చెయ్యి గుర్తుకే అన్న తర్వాత జనాలు గుర్తు పట్టి రోడ్ షో లో గోల చేశారు. ఏ స్లోగన్ ఇయ్యబోయి ఏ స్లోగన్ ఇస్తున్నావని పెద్దగా నవ్వారు. 

జనాల నాడి గుర్తు పట్టిన ఐకె రెడ్డి తర్వాత తన వాయిస్ సవరించుకున్నారు. చెయ్యి లేపండి అనబోయి చెయ్యి గుర్తుకు మనఓటు అనిపించానని సర్ది చెప్పుకున్నారు. అయినప్పటికీ పొరపాటు జరిగిపోయినందుకు సారీ అని కూడా చెప్పారు. ఇంకేముంది మంత్రిగారి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము దుమారం గాను వైరల్ అవుతోంది. సవరించుకున్న తర్వాత మంత్రి కారు గుర్తుకే మనఓటు అనిపించారు. 

వైరల్ గా మారిన మంత్రి ఐకె రెడ్డి వీడియో కింద ఉంది