తెలంగాణ బిసి నేతలు ప్రభుత్వం పై ఉద్యమ భేరి మోగించారు. పంచాయతీ ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి కుదించడాన్ని వారు వ్యతిరేకించారు. పార్టీలకతీతంగా నేతలు హజరై ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. మరో వారం రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రానుండడంతో నోటిఫికేషన్ వచ్చేలోగా ఉద్యమాన్ని ఉదృతం చేయాలని వారు నిర్ణయించారు. అవసరమైతే తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె నిర్వహించిన తీరుగా ఉద్యమించాలని వారు తీర్మానించారు.
2013 లో సుప్రీం కోర్టు స్టే ఆధారంగా పంచాయతీ ఎన్నికలు 34 శాతం రిజర్వేషన్ తో నిర్వహించారని జస్టిస్ వంగాల ఈశ్వరయ్య అన్నారు. ఆ కేసు 2016 లో ముగిసినా దానిని మళ్లీ రీ ఓపెన్ చేయాలని టిఆర్ఎస్ ప్రభుత్వం పిటిషన్ వేస్తే స్టే అమల్లోకి వచ్చేదని దాంతో బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కేవన్నారు. బిసి జనాభా వివరాలను కోర్టుకు ప్రభుత్వం సమర్పించలేదని అందువల్లనే కోర్టు రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని ఆదేశించిదన్నారు. ప్రభుత్వం సకాలంలో స్పందించినట్లయితే బిసిలకు న్యాయం జరిగేదన్నారు.
బిసిల జనాభా అధికంగా ఉన్నా పరిపాలనలో మాత్రం బిసిల మార్క్ కనిపించడం లేదని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. బిసి అభ్యర్దులను గెలిపించాలని పిలుపునిచ్చినా మూగజీవాల్లా అమ్ముడు పోయి అగ్రవర్ణాల వారినే గెలిపిస్తున్నారని నేతలు తప్పుపట్టారు. కూర్చున్న కొమ్మనే నరుక్కునే చందంగా బిసిలు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిసిల రిజర్వేషన్లను తగ్గిస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం చీకటి ఆర్డినెన్స్ తెచ్చిందని జూజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బిసి రిజర్వేషన్ల తగ్గింపులో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఈసికి కూడా భాగముందని ఆయన ఆక్షేపించారు.
పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే గ్రామస్థాయి నుంచి బిసి నేతలు బలపడాల్సి ఉందన్నారు. ఉన్న ఈ తక్కువ సమయంలోనే తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన సకల జనుల సమ్మె మాదిరిగా బిసిలంతా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మెడలు వంచైనా సరే బిసి రిజర్వేషన్లు సాధించుకుంటామని చెరుకు సుధాకర్ అన్నారు. ఉద్యమాన్ని అన్ని విధాల ఆలోచించి నిధానంగా తీసుకెళ్లాలని ఆవేశాలతో కాకుండా సమయ స్పూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు.
బిసి రిజర్వేషన్ల సాధనకు ఉద్యమ ప్రణాళికను నేతలు విడుదల చేశారు. ఉద్యమ ప్రణాళిక ఇలా ఉంది.
-
డిసెంబర్ 27న బిసి విద్యార్ధి, యువజన సంఘాలు కలిసి జిల్లా కేంద్రాలు, రెవిన్యూ డివిజన్లలో రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించాలి
-
28న పార్టీల అధ్యక్షులు, బిసి సంఘాల నేతలు గవర్నర్, సీఎస్ ను కలిసి బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వినతిపత్రాలు అందజేత
-
29న తెలంగాణలోని 31 జిల్లాల కలెక్టరేట్ల ముట్టడి
-
అప్పటికి కూడా సీఎం కేసీఆర్ దిగిరాకపోతే డిసెంబర్ 30 న అఖిల పక్ష నేతలు, అన్ని పార్టీల అధ్యక్షులు సమావేశమై ఉద్యమ ప్రణాళిక రూపొందిస్తారు. సకల జనుల సమ్మె తరహాలో వంటా వార్పు, రాష్ట్ర బంద్, జైల్ భరో, విద్యా సంస్థల బంద్, బిసి ఉద్యోగుల పెన్ డౌన్ లాంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరో వైపు న్యాయ పోరాటం
-
బిసి ల జనాభా గణనను చేపట్టాకే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని వేసిన పిటిషన్ జనవరి 2న విచారణకు వస్తుంది.
-
రిజర్వేషన్ల తగ్గింపు ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా వేసిన రిట్ పిటిషన్ గురువారం విచారణకు రానుంది.
-
బిసి సంఘాలు, నేతలే కాకుండా రాజకీయ పార్టీల నేతలు కూడా హైకోర్టులో న్యాయ పోరాటం చేయాలని పిలుపు
-
సుప్రీం కోర్టులోనూ రివ్యూ పిటిషన్ వేయాలని తీర్మానం
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల తగ్గింపు పై బిసి నేతలు ఆగ్రహంగా ఉన్నారు. జనాభాలో 60 శాతం ఉన్నా కూడా తక్కువ స్థానాలు దక్కడం పై వారు విస్మయం వ్యక్తం చేశారు. తెలంగాణలో మరో సకలజనుల సమ్మె ప్రారంభం కాబోతుందనే చర్చ జరుగుతోంది. మరీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.