టీడీపీ వర్సెస్ వైసీపీ: ఎంపీలంతా రాజీనామా చేసేస్తారన్న మంత్రి పెద్దిరెడ్డి

YCP Mps to Resign If YCP Loose Tirupathi

YCP Mps to Resign If YCP Loose Tirupathi

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన రీతిలో తెలుగుదేశం పార్టీకి సవాల్ విసిరారు. తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ ఓడిపోతే, వైసీపీకి చెందిన ఎంపీలంతా రాజీనామా చేస్తారనీ, టీడీపీ గనుక ఓడితే.. టీడీపీ ఎంపీలంతా రాజీనామా చేస్తారా.? అంటూ సవాల్ విసిరి మంత్రి పెద్దిరెడ్డి ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టించారు. ఈ సవాల్ ఓ పది పదిహేను రోజుల ముందు గనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసి వుంటే, వ్యవహారం ఇంకోలా వుండేది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు.. వైసీపీ ఎంపీలందరి రాజీనామా లేఖల్ని సిద్ధం చేసి, మీడియా ముందుంచితే తిరుపతి ఉప ఎన్నిక మరింత రసవత్తరంగా మారుతోంది. అన్నట్టు, ప్రత్యేక హోదాపై మాట్లాడాల్సింది బీజేపీయేనంటూ బంతిని తెలివిగా బీజేపీ కోర్టులోకి విసిరేశారు మంత్రి పెద్దిరెడ్డి.

నిజానికి, ప్రతిపక్షంలో వున్నప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష కూడా చేశారు. అధికారంలోకి వచ్చాక, కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్క నిరసన కార్యక్రమం కూడా చేపట్టలేకపోయారు. తిరుపతి ఉప ఎన్నికని వైఎస్ జగన్ పాలనకు రిఫరెండం.. అనేకంటే, ప్రత్యేక హోదా విషయమై రిఫరెండం.. అని వుంటే, భారతీయ జనతా పార్టీ ఇరకాటంలో పడి వుండేది. మరోపక్క, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనదైన శైలిలో విమర్శలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడన్నది పెద్దిరెడ్డి విమర్శ. పవన్ కళ్యాణ్‌ని పెయిడ్ ఆర్టిస్టుగానూ పెద్దిరెడ్డి అభివర్ణించేశారు. అధికారంలో వున్నది వైసీపీనే గనుక, ఆ పెయిడ్ ఆర్టిస్టు వ్యవహారమేదో అధికారికంగా వైసీపీ ప్రభుత్వం నిరూపించి వుంటే, వైఎస్ జగన్ విశ్వసనీయత పెరిగేదే. ఏదిఏమైనా, ‘వైసీపీ, తిరుపతిలో ఓడితే, వైసీపీ ఎంపీలంతా రాజీనామా చేస్తారు..’ అన్న మంత్రి పెద్దిరెడ్డి ప్రకటనతో తిరుపతి ఉప ఎన్నిక సెగ తారాస్థాయికి చేరుతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. పంచాయితీ, మునిసిపల్ ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాదించిన వైసీపీకి ఆ మాత్రం నమ్మకం వుండడాన్ని తప్పుపట్టలేం. కానీ, రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా వుండవు. ఈక్వేషన్ మారి, తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ ఓడితే… పెద్దిరెడ్డి మాటకు వైసీపీలో విలువ వుంటుందా.?