కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపనున్న టీడీపీ.?

గాలి ఎటువైపు వీస్తే అటు వెళ్ళిపోతుంది తెలుగుదేశం పార్టీ.! కొన్నాళ్ళ క్రితం బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఆ తర్వాత బీజేపీని వదిలేసి.. కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు. మరిప్పుడు.. అంటే, 2024 ఎన్నికల కోసం బీజేపీతో చేతులు కలుపుతారా.? కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తారా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే బీజేపీ, టీడీపీతో కలిసి తమ పార్టీ 2024 ఎన్నికల్ని ఎదుర్కొంటుందని చెప్పకనే చెప్పారు. జనం ముందర కూర్చుని, విధి విధానాలు ఖరారు చేసుకుంటామనీ అన్నారాయన. అయితే, దీనిపై ఇంతవరకూ టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.

కర్నాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో టీడీపీ నేతలు కొందరు, కాంగ్రెస్ పార్టీ మీద ప్రశంసలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి పని చేస్తే బావుంటుందని టీడీపీ మద్దతుదారులైన నెటిజన్లు కొందరు అభిప్రాయపడుతున్నారు కూడా. మరి, బీజేపీని పూర్తిగా టీడీపీ దూరం పెట్టేస్తుందా.?

టీడీపీ గనుక కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే, జనసేన పార్టీ పరిస్థితి ఏమవుతుంది.? ఇదిప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కాదు కాదు, కాంగ్రెస్ పార్టీ పంచన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరబోతోంది.. అంటూ సోషల్ మీడియాలో ఇంకో చర్చ షురూ అయ్యింది.

కర్నాటక ఎన్నికల ప్రభావం, ఆంధ్రప్రదేశ్‌పై ఎంతలా వుంటుందో చెప్పడానికి ఇదొక నిదర్శనం మాత్రమే. లోక్ సభ సభ్యత్వం రద్దు వ్యవహారంతో, దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పట్ల సింపతీ పెరిగిన మాట వాస్తవం. అదే, వివిధ రాష్ట్రాల్లోని ఆయా పార్టీలు కాంగ్రెస్ వైపు చూసేందుకు ఓ చిన్న అవకాశం కల్పిస్తోంది.