టిడిపికి షాక్…సీనియర్ నేత ఎంవివిఎస్ మూర్తి మృతి

తెలుగుదేశంపార్టీలో సీనియర్ నేత, ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రముఖడైన ఎంవివిఎస్ మూర్తి మృతి చెందారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూర్తి అక్కడికక్కడ మరణించారు. అమెరికాలోని అలాస్కాలో ఉన్న వైల్డ్  లైఫ్ సఫారీని చూడటానికి మరో నలుగురు మిత్రులతో కలిసి వెళుతున్నపుడు అమెరికా కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం ప్రమాదం జరిగింది. మూర్తి ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో ట్రక్ ఢీ కొట్టింది. కారులో ఉన్న వారిలో అందరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఐదుగురిలో ఒక్కరు మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన నలుగురు ప్రమాధ స్ధలంలోనే మరణించినట్లు చెబుతున్నారు.

గోల్డ్ స్టాట్ మూర్తి గా పరిచయమైన మూర్తి అసలు పేరు మతుకుమిల్లి వీర వెంకట సత్యనారాయణమూర్తి. స్వస్ధలం తూర్పు గోదావరి జిల్లానే అయినా విశాఖపట్నంలో స్ధిరపడ్డారు.  కాకినాడలో ఉన్నత విద్య చదివారు. విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ అధినేతగా బాగా పాపులర్. ఒకసారి ఎంపిగా రెండుసార్లు ఎంఎల్సీగా ఉన్నారు. ప్రస్తుతం కూడా మూర్తి టిడిపి ఎంఎల్సీనే. నందమూరి బాలకృష్ణ వియ్యంకుడి తండ్రిగా టిడిపిలో ప్రముఖ స్ధానంలో ఉన్నారు. చంద్రబాబునాయుడుకు కూడా బాగా ఆప్తుడు. రోడ్డు ప్రమాదంలో మూర్తితో పాటు వెలువోలు బసవ పున్నయ్య,  వీరమాచినేని శివప్రసాద్, వీబీ యార్ చౌదరి కూడా  చనిపోయారు.

 

త్వరలో జరగబోయే ఎన్నికల్లో మనవడు, బాలకృష్ణ అల్లుడైన సతీష్ ను విశాఖపట్నం ఎంపిగా పోటీ చేయించాలనే ప్రయత్నంలో ఉన్నారు మూర్తి.  ఇదే విషయాన్ని చంద్రబాబుతో పాటు బాలకృష్ణ, లోకేష్ తో కూడా మాట్లాడి ఫైనల్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇంతలోనే ఇంత ఘోరం జరగటంతో అందరూ షాక్ తిన్నారు. ఈ మధ్యనే నల్డొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చంద్రబాబు బావమరది, బాలకృష్ణ సోదరుడు నందమూరి హరికృష్ణ కూడా మరణించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ విషాధం నుండి కోలుకోకముందే ఇపుడు మూర్తి కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించటం నిజంగా దురదృష్టమే.