Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్ తగిలింది. పవన్ కళ్యాణ్ పై తమిళనాడులో క్రిమినల్ కేసులో నమోదు అయ్యింది. పవన్ కళ్యాణ్ ఇటీవల మురుగన్ భక్తల్ మానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు అంటూ పవన్ కళ్యాణ్ పై తమిళనాడు మదురై జిల్లా అన్నానగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అడ్వకేట్ వాంజినాతన్ ఫిర్యాదు మేరకు పోలీసులు పవన్ కళ్యాణ్, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, సభ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ కేసులో పోలీసులు IPC సెక్షన్ 196(1)(a), 299, 302, 353(1)(b)(2) ల కింద ముమ్మడిగా కేసు నమోదు చేశారు. సదస్సు సందర్భంగా పవన్ కళ్యాణ్ మతం మరియు ప్రాంతాల ఆధారంగా విద్వేషాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు FIRలో నమోదు అయ్యాయి.మదురైలో మురుగన్ భక్తుల సదస్సు జరగడానికి ముందే పోలీసులు కొన్ని ఆంక్షలు విధించినా, వాటిని పాటించకుండా కార్యక్రమాన్ని నిర్వహించారన్నది ప్రధానంగా ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇలా పవన్ కళ్యాణ్ పై తమిళనాడులో కేసు నమోదు కావడంతో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ ఘటనపై కొందరు స్పందిస్తూ పవన్ కళ్యాణ్ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు అంటూ స్పందించగా మరికొందరు మాత్రం చట్టాన్ని అతిక్రమించినట్లయితే దర్యాప్తు జరగాల్సిందే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికార వర్గాలు మాత్రం కేసు నమోదు ప్రాథమిక దశలోనే ఉందని, విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాయి. ఈ విధంగా పవన్ కళ్యాణ్ పై తమిళనాడులో కేసు నమోదు కావడంతో ఇప్పటివరకు జనసేన కానీ లేదా పవన్ కళ్యాణ్ నుంచి కానీ ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.