ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడా చూసినా పంచాయతీ ఎన్నికల హడావిడి వాతావరణం నెలకొని వుంది. తాజాగా మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇప్పటికే మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడినాయి. మూడో దశ పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది. మూడో దశలోనూ టీడీపీ పరిస్థితి ఘోరంగా తయారైంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, కుప్పం ఎమ్మెల్యే అయిన నారా చంద్రబాబు నాయుడికి ఘోర పరాభవం ఎదురైంది.
బాబు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక శాతం పంచాయతీలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ వైసీపీ మద్దతు దారుల హవా కొనసాగుతుండడంతో.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు చేసుకుంటున్నారు. మంత్రులు కన్నబాబు, బొత్స, వెల్లంపల్లి, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈసారి ఫలితాల్లో పుంగనూరు, కుప్పం ఫలితాలు ప్రత్యేకం అంటున్నాయి వైసీపీ శ్రేణులు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి కన్నబాబు.. కుప్పంలో ఫలితాలు ఆశ్చర్యంగా లేవు.. కుప్పంలో చంద్రబాబు కోట కూలటం ఊహించిందేనన్నారు.. కుప్పం అయినా… ఇచ్ఛాపురం అయినా ఇవే ఫలితాలు ఉంటాయని ధీమా వ్యక్తం చేసిన కన్నబాబు. టీడీపీ అంతర్జాతీయ పార్టీ… ఆంధ్రప్రదేశ్ లో కాకపోయినా… అండమాన్ అండ్ నీకోబార్ అయినా నిలబడే ఉంటుంది.. చంద్రబాబుకు ఇబ్బంది ఏమీ లేదు అంటూ ఎద్దేవా చేశారు. కుప్పంలో కూడా బలవంతపు ఏకగ్రీవాలు చేశామని ఆరోపిస్తున్నారంటే… అతను అంత బలహీన నాయకుడో అర్థం చేసుకోవచ్చు అని మండిపడ్డారు మంత్రి కన్నబాబు.