తెలుగుదేశం పార్టీకి ఓ ఎంపీ రాజీనామా చేయబోతున్నారట. ఆయన త్వరలో బీజేపీలో చేరబోతున్నారట కూడా.! ఎవరా ఎంపీ.? ఏమా కథ.? ఆగస్టులో సదరు ఎంపీ, బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారంటూ ప్రచారం జరుగుతున్న దరిమిలా, ఆ ఎంపీ ఎవరన్నదానిపై టీడీపీలో జోరుగా చర్చ సాగుతోంది.
2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి లోక్ సభ సభ్యులుగా గెలిచింది ముగ్గురంటే ముగ్గురే. అందులో ఒకరు కేశినేని నాని కాగా, మరొకరు గల్లా జయదేవ్. మిగిలింది కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఈ ముగ్గురిలో కింజరాపు రామ్మోహన్ నాయుడు టీడీపీని వీడే అవకాశం ప్రస్తుతానికైతే లేదు.
కానీ, టీడీపీతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తోన్నవారిలో ముందు వరుసలో వున్నది మాత్రం కేశినేని నాని. ఆయన మీదకు ఇటీవల స్వయానా ఆయన సోదరుడ్ని దించారు టీడీపీ అధినేత చంద్రబాబు. దాంతో, కేశినేని మరింతగా గుస్సా అవుతున్నారు టీడీపీ అధినాయకత్వం మీద.
‘నన్ను వైసీపీలోకి, బీజేపీలోకి పంపే బదులు.. పార్టీ పటిష్టత కోసం ప్రయత్నించండి..’ అంటూ టీడీపీ మీద ఇటీవల కేశినేని నాని సెటైర్లేసిన విషయం విదితమే. ఇదిలా వుంటే, మరో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా గత కొద్ది కాలంగా టీడీపీలో యాక్టివ్‌గా కనిపించడంలేదు.
ఆగస్టులో పార్టీ మారబోయేది టీడీపీ ఎంపీ కేశినేని నాని అయితే, మరో ఎంపీ గల్లా జయదేవ్ పార్టీ మారేందుకు కూడా పెద్దగా సమయం పట్టకపోవచ్చు. ఆ తర్వాత రామ్మోహన్ నాయుడి మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. పరిస్థితి ఇంతలా వున్నా, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టలేకపోతున్నారు.